ఎస్‌.. మేమంటే.. మేమే!

18 Apr, 2021 03:44 IST|Sakshi
నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లు

‘సాగర్‌’ విజయంపై టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల్లో ధీమా 

సాక్షి, హైదరాబాద్‌: నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ ముగియగా, ఓట్లపరంగా కూడికలు, తీసివేతలు మొదలయ్యాయి. రాష్ట్రంలో ఉత్కంఠను రేకెత్తించిన ఈ ఉపఎన్నికలో గెలుపుపై ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల నేతలు ఎవరికివారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మే 2న ఫలితం తేలేదాకా ‘సాగర’మథనం సశేషమే. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన పోలింగ్‌ సరళిని పరిశీలించిన ఆయాపార్టీల నేతలు ఓట్ల లెక్కల్లో బీజీగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకుతోడు దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడిని బరిలో నిలపడం, రెండుసార్లు సీఎం కేసీఆర్‌ నియోజకవర్గానికి రావడం, పార్టీ అభ్యర్థి ప్రకటనకు ముందు నుంచే నేతలందరూ సమన్వయంతో ఎన్నికల ప్రచారం నిర్వహించడం లాంటి అంశాల ప్రాతిపదికన తమ అభ్యర్థి భగత్‌ విజయం సాధిస్తారని టీఆర్‌ఎస్‌ అంచనా వేస్తోంది.

టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీ ఇచ్చి చివరిక్షణం వరకు అంచనాలు అందలేని స్థాయిలో తన రాజకీయ చాతుర్యాన్ని ఉపయోగించిన సీనియర్‌ నేత, పార్టీ అభ్యర్థి కుందూరు జానారెడ్డి చరిష్మాపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌ పార్టీ కూడా గెలుపుపై విశ్వాసం వ్యక్తం చేస్తోంది. నియోజకవర్గంలో జానా మార్కుకు తోడు పార్టీకి బలమైన కేడర్‌ ఉండటం, సంప్రదాయ ఓటుబ్యాంకు చెక్కుచెదరకపోవడం, పెద్దాయన అనే సానుభూతి, గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు అండగా నిలిచిన కొన్ని సామాజిక వర్గాల ఓట్లలో చీలిక లాంటి లెక్కలతో ఈసారి గెలిచి గట్టెక్కుతామనే అభిప్రాయం టీపీసీసీ నేతల్లో కనిపిస్తోంది. ఇక, జనరల్‌ స్థానంలో ఎస్టీ అభ్యర్థి డాక్టర్‌ రవికుమార్‌ను నిలిపిన కమలనాథులు కూడా చెప్పుకోదగిన స్థాయిలోనే ఓట్లు సాధిస్తామని, ఆ రెండు పార్టీలకు ముచ్చెమటలు పోయించామని భావిస్తోంది.

పోలింగ్‌ శాతం పెరగడంపై ఆశలు
2018 అసెంబ్లీ ఎన్నిక తరహాలోనే నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో పోలింగ్‌ 85శాతంకు పైగా నమోదు కావడం తమకు అనుకూలిస్తుందనే అంచనాలో ఉంది. గత ఎన్నికల్లో 7771 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన టీఆర్‌ఎస్‌ ప్రస్తుతం మూడింతలు మెజారిటీ సాధిస్తామనే ధీమాతో ఉంది. దివంగత ఎమ్మెల్యే నర్సింహయ్య మరణం తర్వాత ఆలస్యం చేయకుండా బరిలోకి దిగి పార్టీ యంత్రాంగాన్ని సన్నద్దం చేయడం, అభ్యర్థి ఎంపికతో సంబంధం లే కుండానే పార్టీ ఇన్‌చార్జీల నేతృత్వంలో ముందస్తు ప్రచారం చేపట్టడం తమకు అనుకూలిస్తుందని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది.  గత ఎన్నికల్లో తమకు అండగాలేని సామాజికవర్గాల్లో చీలిక రావడంతోపాటు ఆయా సామాజికవర్గాలు గతం కన్నా ఈసారి తమవైపు మొగ్గు చూపారని కాంగ్రెస్‌ భావిస్తోంది.

భారీ మొత్తంలో కాకపోయినా కనీసం5–7 వేల ఓట్ల తేడాతో విజయం సాధించి రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని నిరూపించుకుంటామని కాంగ్రెస్‌ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తుండడం గమనార్హం.   టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పట్ల వ్యతిరేకతతో ఉన్న ఓటర్లు తమను ఆదరిస్తారని బీజేపీ భావి  స్తోంది. స్వతంత్ర అభ్యర్థులెవరూ చెప్పుకోదగినస్థాయిలో ఓట్లు దక్కించుకునే అవకాశం లేదని పోలింగ్‌ సరళి వెల్లడిస్తోంది.మొత్తంమీద సాగర్‌ ఉప ఎన్నిక ఫలితం రాష్ట్ర భవిష్యత్‌ రాజకీయాలకు దిక్సూచిగా మారుతుందనడంలో సందేహం లేదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

చదవండి: ‘సాగర్‌’లో భారీగా‌ పోలింగ్‌...ఎవరిదో గెలుపు! 

మరిన్ని వార్తలు