IPAC Assembly Elections: కేసీఆర్‌ సుముఖత.. టీఆర్‌ఎస్‌ వెంట పీకే టీమ్‌

24 Apr, 2022 09:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌కు చెందిన ఇండియన్‌ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ (ఐ ప్యాక్‌) సేవలు తీసుకోవాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే) కాంగ్రెస్‌ పార్టీలో చేరడం దాదాపు ఖాయమైనా కూడా.. ఐప్యాక్‌ సేవలను టీఆర్‌ఎస్‌ వినియోగించుకోబోతోంది. ప్రశాంత్‌ కిశోర్‌ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌కు ఇప్పటికే పలు సూచనలు, ప్రతిపాదనలు చేసినట్టు సమాచారం. వాటి పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన కేసీఆర్‌.. ఐప్యాక్‌తో ఒప్పందం కుదుర్చుకునేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో టీఆర్‌ఎస్‌ రాతపూర్వక ఒప్పందం చేసుకుంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 
చదవండి👉 ‘టీఆర్‌ఎస్‌ మళ్లీ వస్తే గొంతు కోసుకుంటా’

కేసీఆర్‌– పీకే.. సుదీర్ఘంగా భేటీ: ప్రశాంత్‌ కిశోర్‌ శనివారం ఉదయం 9.30 గం. ప్రగతిభవన్‌కు వచ్చి సీఎం కేసీఆర్‌తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. వారు రోజంతా రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై చర్చించారు. ఆదివారం కూడా ఈ చర్చలు కొనసాగుతాయని పార్టీ వర్గాల సమాచారం. టీఆర్‌ఎస్, ఐప్యాక్‌ మధ్య ఒప్పందం జరిగాక.. ఆదివారం సాయం త్రం లేదా సోమవారం ప్రశాంత్‌ కిశోర్‌ ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నట్టు తెలిసింది. 

ప్రచారం, సర్వేలతో.. ప్రశాంత్‌ కిశోర్‌కు చెందిన ఐప్యాక్‌ సంస్థకు సర్వేలు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం, జాతీయ రాజకీయాల్లో చోటుచేసుకునే మార్పులకు అనుగుణంగా వ్యూహరచన అంశాల్లో ఎంతో అనుభవం ఉంది. దీనికితోడు నియోజకవర్గాల వారీగా టీఆర్‌ఎస్, ఇతర పార్టీల పనితీరుపై విశ్లేషణలు, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వ్యూహ రచన, రాష్ట్రంలో వివిధ పార్టీలు చేసే విమర్శలను ఎలా తిప్పికొట్టాలన్న అంశాలపై ఐప్యాక్‌ శాస్త్రీయ సమాచారాన్ని, విశ్లేషణలను అందిస్తుందన్న ఉద్దేశంతో పీకేతో ఒప్పందానికి టీఆర్‌ఎస్‌ మొగ్గు చూపినట్టు తెలిసింది. ఒప్పందం తర్వాత ఐప్యాక్‌ బృందం నేరుగా టీఆర్‌ఎస్‌ యంత్రాంగంతో కలిసి పనిచేస్తుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.   
చదవండి👉🏼 నాకు పీకే చెప్పారు.. టీఆర్‌ఎస్‌కు 30 సీట్లు కూడా రావు: కేఏ పాల్‌

మరిన్ని వార్తలు