చట్టసభల్లో బీసీ కోటాపై మీ చిత్తశుద్ధి ఏంటి? 

12 Aug, 2021 02:21 IST|Sakshi

ఓబీసీ బిల్లుపై చర్చలో కేంద్రాన్ని ప్రశ్నించిన టీఆర్‌ఎస్‌ 

కులాల వారీగా బీసీ జనగణన చేపట్టాలని డిమాండ్‌ 

బీసీల విషయంలోనే పరిమితులు ఎందుకని ఆందోళన 

సాక్షి, న్యూఢిల్లీ: చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లపై మీ చిత్తశుద్ధి ఏంటని కేంద్రాన్ని టీఆర్‌ఎస్‌ ప్రశ్నించింది. రాజ్యాంగ (127వ సవరణ) బిల్లుపై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆ పార్టీ ఎంపీ బండ ప్రకాశ్‌ బీసీ రిజర్వేషన్లపై మాట్లాడుతూ ఆందోళన వ్యక్తంచేశారు. ‘ఓబీసీ జాబితాలో మార్పులు, చేర్పులపై అధికారాలను రాష్ట్రాలకు దఖలుపరుస్తూ ప్రతిపాదించిన బిల్లుకు టీఆర్‌ఎస్‌ మద్దతు ఇస్తోంది. పొరపాటును సరిదిద్దుతూ రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను పునరుద్ధరించడం అభినందనీయం. బీసీ జాబితాలో పలు కులాలను చేర్చాలంటూ వివిధ రాష్ట్రాల్లో డిమాండ్లు ఉన్నాయి. కానీ రిజర్వేషన్లు 50 శాతం మించరాదన్న నిబంధనలు ఉన్నాయి.

ఎస్సీ జనాభా పెరిగినప్పుడు.. బీసీ రిజర్వేషన్‌ తగ్గుతూ వస్తోంది. 50 శాతం పరిమితి కారణంగా బీసీలకు న్యాయమైన వాటా దక్కడం లేదు. 50 శాతం ఏ డేటా ఆధారంగా నిర్ణయిస్తున్నారు? సుప్రీంకోర్టు ఏ డేటాను అనుసరించి నిర్ణయిస్తోంది? శాస్త్రీయ ప్రాతిపదిక ఏముంది? 1931 నుంచి దేశంలో కులాల జనగణన లేదు. ఓబీసీ జనగణన చేస్తామని 2018లో అప్పటి మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ హామీ ఇచ్చారు. రోడ్‌మ్యాప్‌ కూడా ప్రకటించారు. కానీ ఇప్పటివరకు కార్యాచరణ లేదు. వెంటనే బీసీ జనగణన చేపట్టాలి. ఉన్నత విద్యాసంస్థలైన ఐఐటీలు, ఐఐఎంలలో ప్రవేశాలు, చివరకు పీహెచ్‌డీ ప్రవేశాల్లో కూడా రిజర్వేషన్లు సరిగా అమలు కావ డం లేదు.

సమానత్వం కోసం రిజర్వేషన్లు అమలు చేస్తున్నందున రాజకీయంగా కూడా రిజర్వేషన్లు అమలు చేయాలి. తెలంగాణ సీఎం కేసీఆర్‌ చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలని ప్రతిపాదించారు. దీనిని కేంద్రానికి పంపారు. కానీ అది ఇప్పుడు ఎక్కడ ఉందో వెతుక్కోవాల్సిన పరిస్థితి. పార్లమెంటులో బీసీలకు రిజర్వేషన్లపై మీకున్న చిత్తశుద్ధి ఏంటి? లోక్‌సభలో, రాజ్యసభలో బీసీలు ఎంతమంది ఉన్నారు? ఈ అంశాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించండి. చట్టసభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయండి’అని డిమాండ్‌ చేశారు.   

క్రీమీలేయర్‌ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది?

 ‘న్యాయ వ్యవస్థ వెనకబడిన తరగతులకు వ్యతిరేకంగా అనేక తీర్పులు ఇస్తోంది. వెనకబడిన తరగతుల విషయానికి వచ్చేసరికి వారు పరిమితి గురించి ఆలోచిస్తున్నారు. ఈడబ్ల్యూఎస్‌ విషయంలో వారు ఎందుకు పరిమితి ఆలోచించరు? కేంద్రం స్వయంగా 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను అమలు చేస్తూ 50 శాతం పరిమితిని ఉల్లంఘించింది. సుప్రీంకోర్టు ఎం దుకు మౌనంగా ఉంది? మొత్తం రిజర్వేషన్లు 60 శాతానికి పెరిగితే ఎందుకు మౌనంగా ఉన్నారు? కేవలం బీసీల విషయంలోనే క్రీమీలేయర్‌ గురిం చి ఆలోచిస్తారు. ఇతర విషయాల్లో ఎందుకు ఇలా చేయరు? ఈ క్రీమీలేయర్‌ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? రాజ్యాంగంలో ఉందా? మైనా రిటీలు, మహిళలు, ఎస్సీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉన్నప్పుడు బీసీలకు ఎందుకు ఉండదు? బీసీల అభ్యున్నతి లేనప్పుడు దేశాభివృద్ధి కూడా సాధ్యం కాదు’అని బండ ప్రకాశ్‌ చెప్పారు.  

మరిన్ని వార్తలు