నిజామాబాద్‌: గత ఎన్నికల్లో సీట్లు గెలిచినప్పటికీ.. సిట్టింగ్‌లలో టెన్షన్‌

27 Jun, 2022 19:55 IST|Sakshi

ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్న టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అందుకు అనుగుణంగా పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రశాంత్‌ కిషోర్‌కు చెందిన ఐప్యాక్‌ బృందంతో జిల్లాలో నెలల తరబడి అన్ని అంశాలపై ఎమ్మెల్యేల గురించి సమగ్రంగా సర్వే చేయించారు. ఇందుకు సంబంధించిన నివేదికపై కేసీఆర్‌ పోస్ట్‌మార్టం చేస్తున్నారు. 

సాక్షి, నిజామాబాద్‌:  ఆది నుంచి టీఆర్‌ఎస్‌కు కంచుకోటగా ఉన్న నిజామాబాద్‌ జిల్లాలో గత శాసనసభ ఎన్నికల్లో అన్ని సీట్లు గెలిచినప్పటికీ, కేవలం మూడు నెలల తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం కల్వకుంట్ల కవిత ఓటమి నేపథ్యంలో జిల్లాపై సీరియస్‌గా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇక్కడి సర్వే నివేదికలపై, కొందరు ఎమ్మెల్యేల గు ట్టుమట్లపై ప్రత్యేక పరిశీలన చేయనున్నట్లు సమాచారం. 

ఆయా నియోజకవర్గాల్లో ప్రతిపక్ష ఆశావహుల బలాలు, బలహీనతలను కూడా బేరీజు వేసుకుంటూ, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల పనితీరు, వ్యవహార శైలి, నడవడిక, అక్రమాలు, పర్సంటేజీలు, కేడర్‌కు అందుబాటులో లేని పరిస్థితి, భూదందాలు, దాడులు చేయించడం తదితర అంశాలన్నింటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన ఒ క ఎమ్మెల్యే అయితే ఏకంగా పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులనే విచ్చలవిడిగా బెదిరింపులకు గురిచేసిన అంశాలను సైతం ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. జిల్లా నుంచి కొందరు సిట్టింగ్‌లను మార్చాల నే నేపథ్యంలో అన్ని రకాల అంశాలను క్రో డీకరిస్తున్నట్లు తెలుస్తోంది. 

సమీకరణాలివి.. 
బాన్సువాడ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సీనియర్‌ నేత, స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి కుమారుడైన డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి ఈసారి టిక్కెట్టు ఆశిస్తున్నారు. ఆదినుంచి క్షేత్రస్థాయిలో తిరుగులేని పట్టు కలిగి ఉన్న భాస్కర్‌రెడ్డి కి ఈ స్థానం కేటాయిస్తే ఎలా ఉంటుందనే విషయమై కూడా పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్మూ ర్‌ నియోజకవర్గం విషయానికి వస్తే ఎమ్మెల్యే పలుసార్లు స్థానిక ప్రజాప్రతినిధులను బెదిరింపులకు గురి చేసినట్లు సోషల్‌ మీడియాలో ఆడియోలు వైరల్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ విషయాలపై కూడా సర్వేలో పూర్తివివరాలు సేకరించినట్లు సమాచారం.

ఈసారి ఆర్మూర్‌ శాసనసభ స్థానం నుంచి బీజేపీ ఎంపీ అర్వింద్‌ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ స్థానంలో సిట్టింగ్‌ను కొనసాగించాలా లేక అర్వింద్‌ సామాజిక వర్గానికి చెందిన ఆకుల లలితకు టిక్కెట్టు కేటాయించాలా అనే విషయమై కూడా లెక్కలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న కవితను బరిలోకి దింపుతారనే చర్చ పార్టీ వర్గాల్లో, స్థాని క ప్రజాప్రతినిధుల్లో జరుగుతోంది. ఇక నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గం విషయానికి వస్తే గణేష్‌ గుప్తా పనితీరు, వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నుంచి ప్రత్యర్థులు ఎవరెవరుంటారు.. గెలుపోటముల పరిస్థితి ఏమిటనే విషయమై లెక్క లు వేసి సర్వే నివేదికలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

బలాబలాల బేరీజు..
ఈ సర్వే నేపథ్యంలో జిల్లాలో ఎవరెవరికి టిక్కెట్ల కోత పెట్టాలనే విషయమై నిర్ణయించనున్నట్లు సమాచారం. మరోవైపు ప్రత్యర్థి పార్టీల నుంచి ఎవరెవరు పోటీలో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎవరితో పోటీ ఎలా ఉంటుందనే విషయమై కూడా వివరాలు సేకరించారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లో, ఉద్యమకారుల్లో పార్టీ నాయకులపై ఉన్న అభిప్రాయాలను కూడా సేకరించినట్లు తెలిసింది.

ఇక ఉత్తర తెలంగాణలో కీలకమైన నిజామాబాద్‌ జిల్లాలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పోటీ చేయాలని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్న నేపథ్యంలో సదరు అంశంపైనా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. రేవంత్‌ పోటీ చేస్తే ఆ ప్రభావం జిల్లాలో ఎలా ఉంటుందనే విషయమై కూడా వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. మొత్తంమీద ఐప్యాక్‌ సర్వేపై కేసీఆర్‌ మదింపు చేస్తున్న నేపథ్యంలో సిట్టింగ్‌ల్లో టెన్షన్‌ నెలకొంది.

మరిన్ని వార్తలు