సర్వశక్తులూ ఒడ్డాల్సిందే!

16 Nov, 2020 03:27 IST|Sakshi

‘గ్రేటర్‌’ఎన్నికల సారథ్యం కేటీఆర్‌కు 

డివిజన్ల వారీగా మంత్రులు, ప్రజాప్రతినిధులకు బాధ్యత 

ఇప్పటికే మూడు దఫాలుగా సర్వే పూర్తి 

పార్టీ యంత్రాంగం, ప్రజాప్రతినిధులంతా ఇక్కడే మకాం 

18న షెడ్యూల్‌ వెలువడే అవకాశం, ఆలోగా అభ్యర్థుల ఎంపికపై స్పష్టత 

సాక్షి, హైదరాబాద్ ‌: దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికలో ఎదురైన చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని త్వరలో జరిగే గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిల్లోనూ భారీ విజయం సాధించాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. ఇందుకోసం సర్వశక్తులూ ఒడ్డడానికి సిద్ధపడుతోంది. ఈ మేరకు ఈ నెల 12న రాష్ట్ర మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులతో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్‌ వ్యూహం ఖరారు చేశారు.

పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మున్సిపల్‌ శాఖ మంత్రి కె.తారక రామారావుకు గ్రేటర్‌ ఎన్నికలకు సంబంధించి పూర్తి బాధ్యత అప్పగించారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ పర్యవేక్షణలో గ్రేటర్‌ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహం, అన్ని స్థాయిల్లో పార్టీ యంత్రాంగం నడుమ సమన్వయ బాధ్యతలను కేటీఆర్‌ నిర్వర్తిస్తారు. నోటిఫికేషన్‌కు, ఎన్నికల తేదీకి నడుమ ఎక్కువ వ్యవధి ఇవ్వకుండా వేగంగా ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే చాన్స్‌ ఉండటంతో గ్రేటర్‌ ఎన్నికల్లో మెరుపు వేగంతో కదలాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. 

హైదరాబాద్‌కు గులాబీ దండు 
జీహెచ్‌ఎంసీ పరిధిలోని 150 డివిజన్లకు పార్టీపరంగా ఇన్‌చార్జిల నియామకంపై కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ఇన్‌చార్జిల జాబితాపై స్పష్టత రాగా... ఒకటి రెండు రోజుల్లో ఏయే డివిజన్‌లో ఎవరు పనిచేస్తారనే అంశంపై స్పష్టత రానుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ వ్యూహాన్ని సమర్థవంతంగా అమలు చేసే సత్తా ఉన్న ఎమ్మెల్సీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులతో పాటు ఒకరిద్దరు కార్పొరేషన్‌ ఛైర్మన్ల్లకు డివిజన్‌ ఇన్‌చార్జిలుగా బాధ్యతలు అప్పగిస్తారు. మంత్రులు కూడా కేవలం ఒక్కో డివిజన్‌కు మాత్రమే ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన నాటి నుంచి జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు వంటి జిల్లా స్థాయి ప్రజాప్రతినిధులతో పాటు పార్టీ రాష్ట్ర యంత్రాంగమంతా జీహెచ్‌ఎంసీలో మకాం వేసి ప్రచారం నిర్వహిస్తారు. 

ఇప్పటికే మూడు విడతలుగా సర్వే 
జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పటికే మూడు విడతలుగా పార్టీ పరిస్థితి, కార్పొరేటర్ల పనితీరు... తదితరాలపై టీఆర్‌ఎస్‌ సర్వే నిర్వహించింది. గతంలోనే నియోజకవర్గాల వారీగా నియమితులైన పార్టీ ప్రధాన కార్యదర్శులు ఈ సర్వేలో కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. ఈ నివేదికల ఆధారంగా ఇప్పటికే పార్టీ పరిస్థితిపై డివిజన్ల వారీగా పార్టీ అధినేత ఓ అంచనాకు వచ్చినట్లు తెలిసింది. పనితీరు సరిగా లేని కార్పొరేటర్లను పక్కన పెట్టి అవసరమైతే కొత్త వారికి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది.

విపక్షంలో బలమైన నాయకులు ఎవరైనా ఉంటే వారిని పార్టీలోకి రప్పించడంపైనా దృష్టి పెట్టాలని భావిస్తోంది. సుమారు 15 మంది పార్టీ కార్పొరేటర్ల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని గతంలోనే కేటీఆర్‌ వెల్లడించిన నేపథ్యంలో చాలా చోట్ల ఔత్సాహికుల నుంచి టికెట్ల కోసం ఒత్తిళ్లు ప్రారంభమయ్యాయి. ఇన్‌చార్జిల నుంచి మరోమారు నివేదికలు తీసుకుని, షెడ్యూలు వెలువడిన తర్వాత సీఎం, కేటీఆర్‌ వారితో మరోమారు సమావేశమవుతారు. 

మరిన్ని వార్తలు