బీజేపీతో పైసా ఉపయోగం లేదు

3 Aug, 2021 01:47 IST|Sakshi
మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌. చిత్రంలో గంగుల

హుజూరాబాద్‌ మండల ప్రజాప్రతినిధులు, నేతలతో హరీశ్‌రావు  

సాక్షి, సిద్దిపేట: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క సంక్షేమ పథకం కూడా లేదని, రేపు హుజూరాబాద్‌లో వాళ్లు గెలిచినా నయాపైసా ఉపయోగం ఉండ దని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలోని టీఆర్‌ఎస్‌ పార్టీ భవన్‌లో సోమవారం హుజూరాబాద్‌ మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు, నేతలు, ఇన్‌చార్జీలకు ఎన్నికల ప్రచారంపై హరీశ్‌ దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు అనగానే బీజేపీ దొంగ డ్రామాలు ప్రారంభిస్తుందని, ప్రచారంలో గాయాలైనట్లు, అనారోగ్యానికి గురైనట్లు, ఒళ్లంతా పట్టీలు కట్టుకొని తిరుగుతూ సానుభూతి పొందడం ఆ పార్టీ ప్రచార ప్రణాళికలో ఓ ఎత్తుగడ అని విమర్శించారు.

ఈ క్రమంలోనే ఈటల వీల్‌చైర్‌ లో కూర్చుని ప్రచారం చేసి ఓట్లు పొందాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు ఎన్నో విమర్శలు, వెక్కిరింతలు చేసినా ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, రైతుబంధు, కాళేశ్వరం పథకాలే నేడు తెలంగాణ ప్రజల కళ్లల్లో వెలుగులు నింపుతున్నాయన్నారు. ఇదే తరహాలో దళితబంధు పథకం కూడా రాష్ట్రమంతటా అమలు జరుగుతుందని, ఆ దిశగా సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తూ బీజేపీ ఉద్యోగాలు ఊడగొడుతుంటే, టీఆర్‌ఎస్‌ మాత్రం రాష్ట్రంలో భారీఎత్తున ఉద్యోగాలు కల్పిస్తున్నదని హరీశ్‌రావు పేర్కొన్నారు.  భారీ మెజార్టీతో టీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించి సీఎం కేసీఆర్‌కు బహుమతిగా ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్‌ తదితరులు పాల్గొన్నారు.   

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు