-

స్వామిగౌడ్‌ ఆగ్రహం : టీఆర్‌ఎస్‌లో గుబులు

30 Aug, 2020 19:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రశాంతంగా ఉన్న అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ ప్రకంపనలు రేపుతున్నారు. ఇటీవల వివిధ సందర్భాల్లో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డిపై ప్రశంసలు కురిపించడం గులాబీ దళంలో గుబులు రేపుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాక్షితో ముచ్చటించిన స్వామిగౌడ్‌ టీఆర్‌ఎస్‌ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో ఉద్యమకారులను కలుపుకుని పోవడంలేదని ఆగ్రహం చెందారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తమను చూసి హేళన చేసిన వారికి నేడు ప్రభుత్వంలో మంచి గుర్తింపు లభించిందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. (‘గవర్నర్‌ కోటా’ కసరత్తు షురూ!)

గతకొంత కాలంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నిస్తున్నా ఇవ్వడంలేదని తెలిపారు. ఉద్యమ సమయంలో వెన్నంటి ఉండి నడిచిన వారికి కూడా కలిసే సమయం ఇవ్వకపోతే మరెవ్వరికి ఇస్తారని టీఆర్‌ఎస్‌ బాస్‌పై కొపగించుకున్నారు. అయితే ప్రస్తుతం తనకు పార్టీ మారే  ఆలోచన లేదని,  ఉద్యమకారులను, బడుగు బలహీన వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో చేవెళ్ల ఎంపీ టికెట్‌ తనకు ఇస్తానని కేసీఆర్‌ హామీ ఇచ్చారని, కానీ తన స్థానంలో మరొకరికి టికెట్‌ కేటాయించారని గుర్తుచేశారు.

పార్టీ కార్యకలాపాలకు దూరంగా..
గతేడాది ఏప్రిల్‌లో శాసనమండలి సభ్యుడిగా, మండలి చైర్మన్‌గా పదవీ కాల పరిమితి పూర్తి చేసుకున్న స్వామిగౌడ్‌ కొంతకాలంగా టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకలాపాల్లో అంతగా కనిపించట్లేదు. గతంలో గవర్నర్‌ కోటాలో శాసనమండలికి నామినేట్‌ అయిన స్వామిగౌడ్‌ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్‌ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించారు. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి పోటీకి ఆసక్తి చూపినా అవకాశం లభించలేదు. ఏదేని ముఖ్యమైన కార్పొరేషన్‌ పదవి దక్కుతుందని ఆశించినా పార్టీ అధిష్టానం నుంచి స్పందన లేకపోవడంతో స్వామిగౌడ్‌ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు