కారు ‘ఓవర్‌లోడు’ సౌండ్‌.. సుమారు 45 నియోజకవర్గాల్లో నువ్వా నేనా? ‘పోరు’ నేతలు వీరే!

6 Jul, 2022 11:25 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ను వెంటాడుతున్న బహుళ నాయకత్వ సమస్య

సొంత పార్టీ నేతలు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారితో తలనొప్పులు

నిన్న జూపల్లి .. నేడు తీగల

ఇప్పటికే కొందరు సొంతదారి.. 

అధినేత పిలుపు కోసం మరికొందరి ఎదురుచూపులు

కేసీఆర్‌ ఆరా..దిద్దుబాటు షురూ

సాక్షి, హైదరాబాద్‌: అధికార టీఆర్‌ఎస్‌ పార్టీని బహుళ నాయకత్వ సమస్య వెంటాడుతోంది. సొంత పార్టీ నేతలతో పాటు కాంగ్రెస్, టీడీపీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీల నుంచి వచ్చి చేరిన నేతలతో కారు ఓవర్‌ లోడ్‌ కావడం కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతోంది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను సుమారు 45 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ బలమైన బహుళ నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోంది. మరో 20 నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితా లను కొంతమేర ప్రభావం చూపగలిగే నేతలు ఉన్నారు.

మొత్తంగా కనీసం 30 నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు.. సొంత పార్టీలోని బలమైన నేతలతో తలపడాల్సిన పరిస్థితి ఉంది. వచ్చే ఎన్నికల్లోనూ టికెట్‌ తమనే వరిస్తుందని సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేస్తుండగా.. కొన్ని సెగ్మెంట్లలో సిట్టింగ్‌లకు మళ్లీ అవకాశం దొరకక పోవచ్చనే వార్తలు ఆశావహుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

మరోవైపు తమకు టికెట్‌ కష్టమని భావి స్తున్నవారు.. విపక్ష పార్టీలు చేరికల కోసం చేస్తున్న ప్రయత్నాలను అవకాశంగా తీసుకుని ఒకరి వెంట మరొకరు అన్నట్టుగా సొంతదారి చూసుకుంటున్నారు. మరికొందరు అసంతృప్త నేతలు మాత్రం పార్టీ అధినేత కేసీఆర్‌ పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు. అయితే నేతల అంతర్గత విభేదాలపై ఆరా తీసిన అధినేత ఇప్పటికే దిద్దుబాటు చర్యలకు దిగినట్టు పార్టీవర్గాలు చెబుతున్నాయి.
చదవండి👉🏼సబిత కబ్జాలను ప్రోత్సహిస్తున్నారు 

పీకే నివేదికల నేపథ్యంలో..
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ ఐ ప్యాక్‌ బృందం ఈ ఏడాది మార్చిలో టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌కు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నివేదికలు అందజేసింది. ఈ నివేదికలను లోతుగా పరిశీలించి, ఎన్నికల నాటికి ఆయా నియోజకవర్గాల్లో ఉండే రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేయాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. దీంతో సిట్టింగులు, ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే సొంత రాజకీయ అస్తిత్వం కోసం నిర్ణయాలు తీసుకోవాల్సిన తప్పనిసరి స్థితిలో కొందరు నేతలు ఇప్పటినుంచే సొంతదారిని వెతుక్కునే పనిలో పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు అవకాశం దక్కదని భావించిన అసంతృప్త నేతలు నల్లాల ఓదెలు (చెన్నూరు), బూడిద భిక్షమయ్య (ఆలేరు), విజయారెడ్డి (ఖైరతాబాద్‌), తాటి వెంకటేశ్వర్లు (అశ్వారావుపేట) తదితరులు ఇప్పటికే సొంతదారి చూసుకున్నారు. 
చదవండి👉🏼కేటీఆర్‌ సెటైర్‌, దేశ ప్రజలకు మోదీ అందించిన బహుమతి ఇదే!

ప్రత్యర్థితో బహిరంగ యుద్ధం
రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్న కొద్దీ వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఆశిస్తున్న టీఆర్‌ఎస్‌ నేతలు పలువురు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఓ వైపు పార్టీపై, అధినేతపై విశ్వాసం ప్రకటిస్తూనే మరోవైపు స్థానికంగా ఉన్న తమ రాజకీయ ప్రత్యర్థితో బహిరంగ యుద్ధానికి దిగుతున్నారు. కొల్లాపూర్‌లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు..ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, తాండూరులో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పి.మహేందర్‌రెడ్డి.. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఉప్పల్‌లో ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి..మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ నడుమ ఆధిపత్య పోరు కొనసాగుతోంది.

బొంతు జన్మదినం పురస్కరించుకుని మంగళవారం భారీయెత్తున దర్శనమిచ్చిన ఫ్లెక్సీలు నియోజకవర్గంలో చర్చనీయాంశమయ్యాయి. తాజాగా మహేశ్వరం నియోజకవర్గం కూడా ఈ జాబితాలో చేరింది. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. హుస్నాబాద్, నకిరేకల్‌ తదితర అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా పరిస్థితి ఇదే విధంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార పార్టీ నేతల నడుమ ఆధిపత్య పోరు ఎక్కువగా కనిపిస్తోంది.

రేగ కాంతారావు, పాయం వెంకటేశ్వర్లు (పినపాక), భానోత్‌ హరిప్రియ, కోరం కనకయ్య (ఇల్లందు), వనమా వెంకటేశ్వర్‌రావు, జలగం వెంకటరావు (కొత్తగూడెం), కందాల ఉపేందర్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు (పాలేరు) ఈ జాబితాలో ఉన్నారు. సబితా ఇంద్రారెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరినవారు కావడం గమనార్హం.

ఆధిపత్య పోరు కొనసాగుతున్న మరికొన్ని నియోజకవర్గాలు, నేతలు

మరిన్ని వార్తలు