అధికార పార్టీలో ధిక్కార స్వరం.. ‘కారు’కు ఏమైంది? సైలెంట్‌ అవ్వడం తాత్కాలికమేనా?

7 Jul, 2022 14:07 IST|Sakshi

గతంలో తుక్కుగూడ చైర్మన్, బడంగ్‌పేట మేయర్‌  

తాజాగా అసమ్మతి గళం వినిపిస్తున్న తీగల, కొత్త  

మంత్రి సబితారెడ్డిని టార్గెట్‌ చేస్తూ విమర్శలు, ఆరోపణలు 

పట్టనట్లు వ్యవహరిస్తున్న టీఆర్‌ఎస్‌ జిల్లా బాధ్యులు 

సాక్షి, రంగారెడ్డి జిల్లా: అధికార పార్టీలో అసమ్మతి స్వరం పెరుగుతోంది. ఇప్పటికే చేవెళ్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుండగా, తాజాగా మహేశ్వరంలో మంత్రి వర్సెస్‌ మాజీ ఎమ్మెల్యే అన్నట్లుగా మారింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన సబితారెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం అభివృద్ధే ధ్యేయమంటూ హస్తం పార్టీకి బైబై చెప్పి.. గులాబీ కండువా వేసుకున్నారు.

సీఎం కేసీఆర్‌ సహకారంతో ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఇక్కడ అధికార పార్టీ తరఫున పోటీచేసి ఓటమి పాలైన నగర మాజీ మేయర్‌ తీగల కృష్ణారెడ్డి అధిష్టానం హామీతో తాత్కాలికంగా సైలెంట్‌ అయ్యారు. కోడలు అనితారెడ్డికి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పదవిని కట్టబెట్టడంలో సఫలీకృతుడయ్యారు. ఇదిలా ఉండగా పార్టీ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో తనకు సరైన ప్రాధాన్యః దక్కడం లేదంటూ ఇటీవల ధిక్కార స్వరం అందుకున్నారు.   

భగ్గుమంటున్న విభేదాలు 
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సరూర్‌నగర్, ఆర్కేపురం డివిజన్లను బీజేపీ కైవసం చేసుకుంది. తుక్కుగూడ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌కు మెజార్టీ స్థానాలు దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇచ్చి ఆయనను చైర్మన్‌గా ఎన్నుకుంది. ఆ తర్వాత మంత్రితో చైర్మన్‌కు పొసగకపోవడంతో ఆయన టీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరారు. బడంగ్‌పేట్, మీర్‌పేట్‌ కార్పొరేషన్లలో మెజార్టీ స్థానాలను గులాబీ పార్టీ సొంతం చేసుకుంది.

అధికార పార్టీ ఇక్కడ మేయర్లుగా ఎన్నికయ్యారు. వీరిలో బడంగ్‌పేట్‌ మేయర్‌ చిగిరింత పారిజాత.. మంత్రి సబితకు మధ్య అంతర్గత విబేధాలు తార స్థాయికి చేరాయి. మంత్రితో పొసగక మేయర్‌ దంపతులు, మరో ఇద్దరు కార్పొరేటర్లు కాంగ్రెస్‌ గూటికి చేరారు. ఆ తర్వాత మరికొందరు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. అసమ్మతి వర్గం కార్పొరేటర్లతో చర్చలు జరుపుతున్న సమయంలోనే అనూహ్యంగా గత మంగళవారం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మంత్రినే టార్గెట్‌ చేస్తూ  ఆమెపై విరుచుకుపడ్డారు. ఇదంతా టీ కప్పులో తుఫాను వంటిదేనని, అన్నతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దుతానని సబిత ప్రకటించారు.   

నేతల చూపు.. కాంగ్రెస్‌ వైపు  
పరిస్థితి చక్కబడకముందే బుధవారం అదే పార్టీకి చెందిన మరో సీనియర్‌ నేత కొత్త మనోహర్‌రెడ్డి మంత్రిని టార్గెట్‌ చేస్తూ మాట్లాడటం అధికార పార్టీలో కలకలం రేపుతోంది. మొదటి నుంచి టీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్న మనోహర్‌రెడ్డితో పాటు మహేశ్వరం, కందుకూరు మండలాల్లోని ఎంపీటీసీలు, సర్పంచ్‌లతో పాటు బడంగ్‌పేట్, మీర్‌పేటకు చెందిన మరికొందరు కార్పొరేటర్లు కూడా అసమ్మతి స్వరం వినిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. పరిస్థితిని చక్కదిద్దాల్సిన జిల్లా అధిష్టానం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసమ్మతి స్వరం పెంచిన సీనియర్లంతా త్వరలోనే పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు