Hyderabad: గులాబీకి సారథి ఉన్నా కార్యవర్గం కరువు.. కాంగ్రెస్‌కు కానరాని నగర అధ్యక్షుడు

12 Jul, 2022 07:41 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: గులాబీకి సారథి ఉన్నా.. కార్యవర్గ కూర్పు జరగలేదు. ఇక కాంగ్రెస్‌ సేనాని అస్త్రసన్యాసం చేసి ఏడాదిన్నరైనా కొత్త బాస్‌ను ఎంపిక చేయలేదు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నా.. అధికార, విపక్ష పార్టీలు మాత్రం నగరంలోని పార్టీలను గాడిలో పెట్టేదిశగా అడుగులు వేయడం లేదు. నాలుగేళ్ల క్రితం జిల్లా కమిటీల వ్యవస్థను రద్దు చేసిన టీఆర్‌ఎస్‌ దళపతి.. ప్రజాప్రతినిధులతో పార్టీ కార్యకలాపాలు సాగించారు.

పార్టీని సమన్వయపరచడంలో ఇబ్బందులు తలెత్తడంతో మరోసారి పాత పద్ధతిలో కమిటీలను పునరుద్ధరించారు. ఆ మేరకు జిల్లాల అధ్యక్షులను ప్రకటించిన టీఆర్‌ఎస్‌ బాస్‌.. హైదరాబాద్‌ జిల్లా పగ్గాలను జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు అప్పగించారు. బాధ్యతలు అప్పగించి ఆరు నెలలైనా.. ఇప్పటివరకు కార్యవర్గాన్ని ప్రకటించలేదు. అనుబంధ కమిటీల ఊసేలేదు. కేవలం అధ్యక్ష పదవితోనే సరిపెట్టారు. దీంతో జిల్లా అధ్యక్షులు కేవలం ఉత్సాహ విగ్రహాలుగానే మారారు. పార్టీ పదవులు ఆశించిన ద్వితీయ శ్రేణి నేతలు ఎన్నికలు దగ్గరపడుతుండడంతో ఆశలు వదులుకున్నారు. 
 
బీజేపీ కట్టడిలో రెండు పార్టీలూ విఫలం
గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గణనీయంగా సీట్లు సాధించిన భారతీయ జనతాపార్టీ... హైదరాబాద్‌పై పట్టు బిగించే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇటీవల జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణతో మరింత దూకుడు పెంచింది. జూబ్లీహిల్స్‌లో గ్యాంగ్‌ రేప్, డ్రగ్స్‌ తదితర అంశాలపై ఉద్యమాలు సాగించడం ద్వారా క్షేత్రస్థాయిలో బలపడే విధంగా పావులు కదుపుతోంది.

ఇదే సమయంలో బీజేపీ దూకుడును అడ్డుకోవడంలో గులాబీ నగర నాయకత్వం చేతులెత్తేసింది. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మినహా స్వతహాగా ఎలాంటి నిర్ణయం తీసుకోవడంలేదు. కనీసం అసెంబ్లీ స్థాయిలో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాలను కూడా నిర్వహించలేకపోతోంది. ప్లీనరీ వేళ మొక్కుబడిగా సమావేశాలు నిర్వహించి చేతులు దులుపుకొంది. ఎమ్మెల్యేగా, అధ్యక్షుడిగా జోడు పదవులు ఉండడంతో పార్టీకి సరైన న్యాయం చేయడం లేదనే విమర్శలున్నాయి.  

హస్తవాసి మారేనా?  
పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయాలని భావించిన పీసీసీ నాయకత్వం.. హైదరాబాద్‌ను మూడు జిల్లాలుగా విభజించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం సంస్థాగతంగా మంచిదే అయినా.. రెండేళ్లుగా జిల్లా కాంగ్రెస్‌ కమిటీని నియమించలేదని అధిష్టానం.. ఈ మూడింటికి సారథులను ఎక్కడి నుంచి తెస్తుందనే అనుమానం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. 15 అసెంబ్లీ సెగ్మెంట్లను అయిదేసీ నియోజకవర్గాల చొప్పున హైదరాబాద్, సికింద్రాబాద్, ఖైరతాబాద్‌ జిల్లాలుగా కాంగ్రెస్‌ కమిటీలు వేయాలని పీసీసీ ప్రతిపాదించింది. దీనికి ఏఐసీసీ కూడా ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది.

సికింద్రాబాద్‌ డీసీసీ పరిధిలో సికింద్రాబాద్, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, ముషీరాబాద్, కంటోన్మెంట్‌.. హైదరాబాద్‌ డీసీసీ పరిధిలో చార్మినార్, బహుదూర్‌పుర, మలక్‌పేట్, యాకుత్‌పురా, చాంద్రాయణగుట్ట.. ఖైరతాబాద్‌ డీసీసీ పరిధిలో ఖైరతాబాద్, అంబర్‌పేట్, గోషామహల్, నాంపల్లి, కార్వాన్‌ నియోజకవర్గాలు ఉండనున్నాయి. హైదరాబాద్‌పై కాంగ్రెస్‌ అధిష్టానం మొదటి నుంచి అంతగా దృష్టి సారించలేదు. రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉన్న రాజధానిపై నాయకత్వానికి కనీస వ్యూహం కూడా లేదనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా నగరాన్ని మూడు డీసీసీలుగా విభజించిందనే ప్రచారం జరుగుతోంది. 

అంజన్‌ నిష్క్రమణతో.. 
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాభవానికి బాధ్యత వహిస్తూ మాజీ ఎంపీ, డీసీసీ అధ్యక్షుడు అంజన్‌కుమార్‌ యాదవ్‌ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయనకు పదోన్నతి కల్పిస్తూ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవిని ఏఐసీసీ కట్టబెట్టింది. దీంతో అప్పటి నుంచి హైదరాబాద్‌ నగర కాంగ్రెస్‌కు సారథి లేకుండా పోయారు. సరైన సారథ్యం, మార్గనిర్దేశం లేకపోవడంతో నగరంలో కాంగ్రెస్‌ సంస్థాగతంగా బలహీనపడింది. ఆఖరికి పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియలోనూ చతికిలపడింది. సభ్యత్వ నమోదుపై కనీసం సమీక్షించేవారు లేకపోవడంతో పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది.

నగర ప్రజల సమస్యలపై పోరాటంలోనూ ఆ పార్టీ వెనుకబడింది. బీజేపీ ఒకవైపు దూకుడుగా ముందుకెళుతుండగా.. కాంగ్రెస్‌ మాత్రం  ప్రజాక్షేత్రంలోకి వెళ్లడంలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. దీనికి ప్రధాన కారణం సారథి, కార్యవర్గం లేకపోవడమే. తాజాగా మూడు డీసీసీలను నియమించాలని పీసీసీ నిర్ణయించిన నేపథ్యంలో కొత్త కెప్టెన్లయినా పార్టీని గాడిలో పెడతారో లేదో వేచిచూడాల్సిందే!

చదవండి: దమ్ముంటే నాలుగు రోజుల్లో ప్రభుత్వాన్ని రద్దు చెయ్‌

మరిన్ని వార్తలు