పార్టీలో ప్రాధాన్యత లేదనడం సత్యదూరం

4 May, 2021 12:35 IST|Sakshi

ఈటల వ్యాఖ్యలపై మంత్రుల కౌంటర్‌

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌, ప్రభుత్వంపై ఈటల రాజేందర్‌ ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మండిపడ్డారు. ఈటల వ్యాఖ్యలపై మంత్రులు కౌంటర్‌ ఇచ్చారు. ఆయన వ్యవహారంపై మంత్రులు​ మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఈటలకు పార్టీలో అధిక ప్రాధాన్యత ఇచ్చామని.. ఆయనకు ఎక్కడ ఆత్మగౌరవం దెబ్బతిందని కొప్పుల ఈశ్వర్‌ ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నవారే పదవుల్లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

‘‘ఎల్పీ నాయకుడిగా ఈటలకు అవకాశం ఇచ్చారు. ఈటలకు మంత్రి పదవితో పాటు కీలక శాఖలు కూడా ఇచ్చారు. పార్టీలో గౌరవం దక్కినా ఈటల విమర్శలు చేస్తున్నారు. ఈటలకు మంత్రి పదవితో పాటు కీలక శాఖలు అప్పగించారు. పార్టీలో ప్రాధాన్యత లేదనడం సత్యదూరం. అసైన్డ్‌ భూములను కొనరాదు.. అమ్మరాదు అనే విషయం తెలియదా?. మంత్రిగా ఉండి అసైన్డ్ భూములను ఎందుకు కొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఈటల నష్టం చేశారని’’ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.

‘‘కుటుంబ అవసరాల కోసం అసైన్డ్ భూములు కొనడం తప్పు కాదా?. దేవరయాంజల్‌లో దేవాదాయ భూములను ఎందుకు కొన్నారు?’ అంటూ మంత్రి ఈశ్వర్‌ ప్రశ్నలు సంధించారు. ఆరోపణలపై సమాధానం ఇవ్వకుండా సీఎంపై విమర్శలు చేస్తున్నారని.. రెండేళ్లుగా ఈటల పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మంత్రి కొప్పుల నిప్పులు చెరిగారు.

బీసీ ముసుగులో ఉన్న పెద్ద దొర ఈటల రాజేందర్..
ఈటల రాజేందర్‌ మేక వన్నె పులి అంటూ మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను దొర అని సంభోదించడం సరికాదన్నారు. ‘‘బీసీ ముసుగులో ఉన్న పెద్ద దొర ఈటల రాజేందర్. ముదిరాజులు, బలహీనవర్గాల గురించి ఈటల ఏనాడూ ఆలోచించలేదు. కమలాపూర్‌లో చీమలు పెట్టిన పుట్టలో పాములా చేరారు. ఈటల పార్టీలోకి రాకముందే కమలాపూర్‌ జడ్పీ పీఠం గెలిచాం. పార్టీ గెలిస్తే ఏడవడం.. పార్టీ ఓడితే నవ్వడం ఈటల పని’’ అంటూ మంత్రి గంగుల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

చదవండి: Etela:హైకోర్టును ఆశ్రయించిన ఈటల కుటుంబం
ఈటల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!

మరిన్ని వార్తలు