కేంద్రంతో ఇక బిగ్‌ఫైట్‌  

11 Sep, 2020 02:22 IST|Sakshi
గురువారం ప్రగతిభవన్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలతో సమావేశమైన సీఎం కేసీఆర్‌. చిత్రంలో ఎంపీలు కె.కేశవరావు, నామా నాగేశ్వరరావు

 పార్లమెంట్‌ లోపల, బయట తేల్చుకుంటాం: కేకే, నామా

కలిసి వచ్చే పార్టీలతో ఆందోళన చేస్తాం

రాష్ట్ర బీజేపీ ఎంపీలు తెలంగాణ బిడ్డలైతే మాట్లాడాలి

డిప్యూటీ చైర్మన్‌ పదవిని రాజకీయాల్లోకి లాగొద్దని సూచన

పార్లమెంట్‌ సమావేశాలపై టీఆర్‌ఎస్‌ ఎంపీలకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రం ఏర్పాటై ఏడేళ్లు కావొస్తున్నా కేంద్ర ప్రభుత్వం తన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైందని టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్‌ కె.కేశవరావు విమర్శించారు. నదీ జల వివాదాలు, జీఎస్టీ పరిష్కారం, విద్యుత్‌ సంస్కరణలు తదితర అంశాలపై తమతో కలిసి వచ్చే పార్టీలతో పార్లమెంట్‌ లోపల, బయట నిరసన తెలియ జేస్తామని వెల్లడించారు. జీఎస్టీ పరిహారా నికి సంబంధించి పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తామన్నారు. ముఖ్యమంత్రితో టీఆర్‌ఎస్‌ ఎంపీల భేటీ అనంతరం ఆ వివరాలను గురువారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు, పార్టీ ఎంపీలతో కలసి కేకే మీడియాకు వెల్లడించారు. కేంద్రానికి ఇన్నాళ్లూ సహకరిస్తూ వచ్చామని, ఈ సమావేశాల్లో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక గురించి ప్రస్తావిస్తూ రాజ్యాంగ పదవులను రాజకీయాల్లోకి లాగడం సరికాదన్నారు. ఆ పదవికి పోటీ చేయమని తనను కాంగ్రెస్‌ పార్టీ సంప్రదించిందని తెలిపారు.

తెలంగాణ బిడ్డలైతే మాట్లాడాలి... 
రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ జరిపే పోరాటానికి రాష్ట్రానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్‌ ఎంపీలు కలిసి వస్తారో లేదో తేల్చుకోవాలని నామా సవాల్‌ చేశారు. రాష్ట్ర సమస్యలపై ఏడేళ్లుగా సీఎం కేంద్రానికి ఎన్నో ఉత్తరాలు రాశారని, ఇకపై కేంద్రాన్ని వదిలి పెట్టే ప్రసక్తి లేదన్నారు. వ్యవసాయ మోటార్లకు విద్యుత్‌ మీటర్లు బిగించాలనే కేంద్రం ఆలోచనను బీజేపీ ఎంపీలు ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు. పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలను రద్దు చేయడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు.

ముఖం చాటేస్తున్న కేంద్రం...
కృష్ణా నదీ జల వివాదాల పరిష్కారంలో కేంద్రం ముఖం చాటేస్తోందని, దేశంలో 70వేల టీఎంసీలు అందుబాటులో ఉన్నా.. 40వేల టీఎంసీల నీటినే వినియోగించుకునే స్థితిలో ఉన్నామని కేకే, నామా వివరించారు. రాష్ట్రానికి 10.5 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా రావాల్సి ఉండగా, 8.79 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే విడుదల చేయడం సమంజసమా అని ప్రశ్నించారు. విద్యుత్‌ సంస్కరణల పేరిట ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థను కేంద్రం చేతుల్లోకి తీసుకునే ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. జాతీయ రహదారులు, నవోదయ పాఠశాలలు, టెక్స్‌టైల్‌ పార్కు, ఎయిర్‌స్ట్రిప్‌లకు అనుమతి విషయంలో కేంద్రం వైఖరిపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎస్టీ పరిహారం, ఐజీఎస్టీ, బీఆర్‌జీఎఫ్‌ తదితరాల రూపంలో రాష్ట్రానికి 8,850 కోట్లు రావాల్సి ఉందని వెల్లడించారు.

సీఎం దిశానిర్ధేశం...
అంతకుముందు టీఆర్‌ఎస్‌ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. ఈ నెల 14 నుంచి జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని వివరించారు. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్‌ సంస్కరణలు, జీఎస్టీ విషయంలో పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ సభ్యులు అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్‌ దిశానిర్ధేశం చేశారు. 

మరిన్ని వార్తలు