TRS: హుజూరాబాద్‌లో ఇక దూకుడే!

11 Jun, 2021 08:56 IST|Sakshi

హరీశ్‌రావు నేతృత్వంలోని కమిటీ నిర్ణయం

త్వరలో క్షేత్ర స్థాయి పర్యటనలకు శ్రీకారం 

ఈటల బీజేపీలో చేరిక ఖరారుతో వ్యూహ రచన

సాక్షి, హైదరాబాద్‌: హుజూరాబాద్‌లో ఇక దూకుడు పెంచాలని మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ నిర్ణయించింది. వీలైనంత త్వరలో క్షేత్ర స్థాయి పర్యటనకు శ్రీకారం చుట్టాలని, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని, నేరుగా కేడర్‌తో మమేకమయ్యేలా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించింది. హుజూరాబాద్‌ లో టీఆర్‌ఎస్‌ కార్యకలాపాలను సమన్వయం చేస్తు న్న మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని కమిటీ గురువారం హైదరాబాద్‌లో మంత్రుల నివాస సముదాయంలోని కొప్పుల ఈశ్వర్‌ నివాసంలో భేటీ అయింది. మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌ కుమార్‌ పాల్గొన్నారు.

కాగా ఈటల రాజేందర్‌ ఈ నెల 14న బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకోవడంతో టీఆర్‌ఎస్‌ కూడా శరవేగం గా పావులు కదుపుతోంది. శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించిన ఈటల.. 13న స్పీకర్‌కు రాజీనామా పత్రాన్ని అందజేసే అవకాశం ఉంది. దీంతో హుజూరాబాద్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం కానుండటంతో అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించారు. ఈనెల 5న మంత్రి గంగుల నివాసంలో సమావేశంలో ఖరారు చేసిన వ్యూహంపై మరోమారు చర్చించినట్లు సమాచారం. 

సానుభూతి ఉందా? 
ఈటల బీజేపీలో చేరిక తర్వాత నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితి ఉంటుంది, ఏదైనా సానుభూతి ఉందా.. వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం. రెండు రోజుల పాటు హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఈటల పర్యటన తీరుతెన్నులపై చర్చ జరిగినట్లు తెలిసింది. మంత్రివర్గం నుంచి ఈటల బర్తరఫ్‌ తర్వాత హుజూరాబాద్‌ టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్‌తో వరుస భేటీ అవుతూ హుజూరాబాద్‌లో పట్టు సాధించేందుకు వ్యూహరచన చేస్తున్నారు.   

14న బీజేపీలోకి ఈటల 
సాక్షి,హైదరాబాద్‌: మాజీమంత్రి ఈటల రాజేందర్‌ ఈనెల 14న ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాష్‌ నడ్డా సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి తదితరులు కూడా బీజేపీలో చేరనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర ముఖ్య నేతలు కూడా ఈటల చేరిక సమయానికి ఢిల్లీకి వెళ్లనున్నారు. గత నెల 31న ఢిల్లీలో జేపీ నడ్డాతో భేటీయైనప్పుడు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, బీజేపీలో చేరితే తనకుండే ప్రాధాన్యం తదితర అంశాలపై చర్చించారు. బీజేపీ జాతీయ నేతలు కూడా తనకు సముచిత స్థానం కల్పిస్తామని హామీనివ్వడంతో పార్టీలో చేరేందుకు సిద్ధం అయ్యారు. తొలుత ఈ నెల 13 లేదా 14న బీజేపీలో చేరేందుకు పార్టీ అధ్యక్షుడు నడ్డా అపాయింట్‌మెంట్‌ కూడా కోరారు. అయితే 14న ఢిల్లీకి రమ్మని ఆహ్వానం అందడంతో అదేరోజు బీజేపీలో చేరనున్నారు.  

చదవండి: నిరుద్యోగ భృతి ఏమైంది?.. టీఆర్‌ఎస్‌ పార్టీపై ఈటల ఫైర్‌

మరిన్ని వార్తలు