‘అసమ్మతి’ కమిటీలు! 

3 Oct, 2021 04:06 IST|Sakshi

గడువు దాటినా పూర్తికాని టీఆర్‌ఎస్‌ సంస్థాగత నిర్మాణం 

అసంతృప్తులను పక్కనపెట్టి ఎమ్మెల్యేల అనుచరులకే చోటు 

సద్దుమణగని మేడ్చల్, ఆలేరు, తాండూరు అసమ్మతి  

దసరా తర్వాతే జిల్లా, రాష్ట్ర కమిటీలు ఏర్పాటయ్యే అవకాశం 

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ సంస్థాగత కమిటీల ఏర్పాటు ఆలస్యమవుతోంది. ఈ నెలాఖరులోగా అన్ని స్థాయిల్లో కమిటీల నిర్మాణం పూర్తి చేసి నవంబర్‌ మొదటి వారంలో పార్టీ ద్వి దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ భావించారు. అయితే, నియోజకవర్గ స్థాయిలో విభేదాలు, కమిటీల్లో చోటు కోసం ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జిలపై ఒత్తిడి తదితర కారణాలతో కమిటీల ఏర్పాటు మందకొడిగా సాగుతోంది.

అందరినీ కలుపుకొని వెళ్లాలని అధిష్టానం చెప్పినా ఎమ్మెల్యేలు ఒంటెద్దు పోకడలు పోతున్నారని అసమ్మతి నేతలు అంటున్నారు. మేడ్చల్‌ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి నడుమ నెలకొన్న విభేదాలు సీఎం కేసీఆర్‌ వద్దకు చేరాయి. కమిటీల ఏర్పాటులో మల్లారెడ్డి తనను సంప్రదించడం లేదని మేడ్చల్‌ జడ్పీ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌ చంద్రారెడ్డి ఏకంగా రాజీనామాకు సైతం సిద్ధపడిన విషయం తెలిసిందే.

శరత్‌ ప్రస్తుతానికి రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నా, ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్‌ తిరిగి వచ్చిన తర్వాతే మేడ్చల్‌ పంచాయతీకి తెరపడే అవకాశముంది. తాండూరు నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి మధ్య నెలకొన్న పంచాయతీ కేటీఆర్‌ వద్దకు చేరింది. ఎవరికి వారు తమ అనుచరులతో గ్రామ, వార్డు కమిటీలను ఏర్పాటు చేసుకోగా, పట్టణ కమిటీకి అధ్యక్షుడిని ప్రకటించి మిగతా కార్యవర్గం జోలికి వెళ్లలేదు. ఇద్దరిలో ఎవరి కమిటీకి అధిష్టానం ఆమోదముద్ర వేస్తుందనే ఉత్కంఠ కేడర్‌లో ఉంది. ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండల కమిటీ ఏర్పాటు సందర్భంగా జరిగిన ఘర్షణపై ఎమ్మెల్యే సునీత, స్థానిక నేతలు రెండు వర్గాలుగా విడిపోయి కేటీఆర్‌కు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. 

ఇతర వర్గాలను పట్టించుకోని ఎమ్మెల్యేలు 
ఎమ్మెల్యేలే ఆధిపత్యం చెలాయిస్తుండటంతో పార్టీలో దీర్ఘకాలంగా ఉన్న వారు, వివిధ సందర్భాల్లో పార్టీలో చేరిన వారు తమ అనుచరులకు కమిటీల్లో చోటు దక్కకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొల్లాపూర్‌లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కమిటీల ఏర్పాటుకు దూరంగా ఉండగా.. నకిరేకల్, పాలేరు, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం, ఇల్లందు, పినపాక, భూపాలపల్లి తదితర నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల అనుచరులకే అవకాశం దక్కింది.

ఇదిలాఉంటే ఎమ్మెల్యేల కనుసన్నల్లో కమిటీలు ఏర్పాటైనా మండల, పట్టణ, గ్రామ కమిటీల ఏర్పాటులో కేడర్‌ నడుమ పోటీ ఉండటం కూడా తలనొప్పులకు దారితీస్తోంది. ఇదిలాఉంటే గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో బస్తీ కమిటీల ఏర్పాటు కూడా మందకొడిగా సాగుతోంది. 150 డివిజన్‌ కమిటీలతో పాటు 400కు పైగా బస్తీ కమిటీలు ఏర్పాటు చేయాలనుకున్నా ఇప్పటివరకు సగం మాత్రమే పూర్తయినట్లు సమాచారం. 

దసరా తర్వాతే... 
ఈనెల 12లోగా గ్రామ, మున్సిపల్‌ వార్డు, 20వ తేదీలోగా మండల, పట్టణ కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని కేసీఆర్‌ గడువు విధించారు. అయితే ఇప్పటివరకు 30 నియోజకవర్గాల నుంచి మాత్రమే పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వివరాలు అందినట్లు తెలిసింది. గడువులోగా ప్రక్రియ పూర్తి చేసేందుకు కేటీఆర్‌ రెండు పర్యాయాలు పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశం కూడా నిర్వహించారు. అన్ని స్థాయిల్లోనూ ప్రధాన కమిటీల్లో చోటు కోసం పోటీపడుతున్న నేతలు, క్రియాశీల కార్యకర్తలు అనుబంధ కమిటీలపై మాత్రం ఆసక్తి చూపడం లేదు.

అన్ని స్థాయిల్లోనూ ప్రధాన కమిటీలతోపాటు మహిళ, విద్యార్థి, యువజన, రైతు, కార్మిక, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సెల్‌తోపాటు సోషల్‌ మీడియా కమిటీలు కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. గ్రామ కమిటీల్లో 11 నుంచి 15 మంది, అనుబంధ కమిటీల్లో 15 మంది, మండల కమిటీల్లో 22 మందికి అవకాశం ఇచ్చారు. జిల్లా కమిటీల్లో అధ్యక్షుడితోపాటు 24 మందికి అవకాశం లభిస్తుంది. క్రియాశీల కార్యకర్తలకు మాత్రమే చోటు కల్పించాలనే నిబంధన ఉండటంతో అనుబంధ కమిటీల ఏర్పాటుకు అవసరమైన మేర క్రియాశీల కార్యకర్తలు లేక కమిటీలు అసంపూర్తిగా ఉన్నట్లు తెలిసింది. ఓ వైపు గడువు ముగియడం, మరోవైపు కమిటీల్లో చోటు కోసం పోటీ పడుతున్న అనుచరులు వెనక్కి తగ్గకపోవడంతో కమిటీలకు తుది రూపు ఇవ్వడంలో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జిలు తర్జనభర్జన పడుతున్నారు. 

మరిన్ని వార్తలు