అంతా పార్టీ గుప్పిట్లోనే..! 

26 Aug, 2021 03:17 IST|Sakshi

చురుగ్గా ఉండే క్రియాశీల నేతలకే టీఆర్‌ఎస్‌ కమిటీల్లో చోటు 

ఎమ్మెల్యేలపై నెలకొన్న ప్రతికూలత పార్టీపై పడకుండా జాగ్రత్తలు 

క్షేత్రస్థాయి కార్యకలాపాలన్నీ పార్టీ యంత్రాంగం చేతుల మీదే.. 

సమన్వయానికి పెద్దపీట వేసేందుకు జిల్లా కమిటీల పునరుద్ధరణ 

సంస్థాగత శిక్షణ కార్యక్రమాలతో కేడర్‌కు దగ్గరవ్వాలనే వ్యూహం

సాక్షి, హైదరాబాద్‌: ‘పార్టీని చూసే ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు.. పార్టీలోకి నేతలు వస్తూ పోతూ ఉంటారు.. పార్టీయే సుప్రీమ్‌’అని రెండు రోజుల క్రితం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించిన దానికి అనుగుణంగా పార్టీ కమిటీలను పటిష్టం చేసే కసరత్తు మొదలైంది. సభ్యత్వ నమోదు ప్రక్రియ కొలిక్కి రావడంతో రాబోయే రోజుల్లో పార్టీ కేంద్రంగానే నేతలు, కార్యకర్తల యంత్రాంగం పనిచేసేలా సంస్థాగత కమిటీలకు జవసత్వాలు కల్పించాలని అధినేత నిర్ణయించారు. గ్రామస్థాయి మొదలుకుని రాష్ట్ర స్థాయి వరకు అన్ని కమిటీల నిర్మాణంలో సామాజిక వర్గాల సమతూకం పాటిస్తూ పాత, కొత్త తేడా లేకుండా చురుకైనవారు, యువతకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు.

కమిటీల నిర్మాణంలో పాటించాల్సిన మార్గదర్శకాలను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు నేతృత్వంలో ఒకటి, రెండు రోజుల్లో జరిగే భేటీలో ఖరారు చేస్తారు. గ్రామ, మండల స్థాయి సంస్థాగత కమిటీలు పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యేల కనుసన్నల్లో ఏర్పాటవుతుండగా, ఈసారి మాత్రం పార్టీ ఇన్‌చార్జీల పర్యవేక్షణలో గ్రూపులు, వర్గాలకు అతీతంగా కమిటీలను నియమించేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. విజయదశమికి అటూ ఇటూగా పార్టీ జిల్లా కార్యాలయాలు ప్రారంభించిన తర్వాత కొత్తగా ఏర్పాటయ్యే కమిటీలకు శిక్షణ ఇచ్చేలా పార్టీ రాష్ట్ర కార్యాలయం షెడ్యూల్‌ను సిద్ధం చేస్తోంది. సామాజిక మాధ్యమాల్లో పార్టీ, ప్రభుత్వంపై జరుగుతున్న దాడిని తిప్పి కొట్టేందుకు అన్ని స్థాయిల కమిటీల్లో యువతకు చోటు కల్పించాలని నిర్ణయించారు. 

ఎమ్మెల్యేల తీరుతో పార్టీకి తలనొప్పి.. 
ఉపఎన్నిక జరగాల్సిన హుజూరాబాద్‌  నియోజకవర్గాన్ని మినహాయిస్తే ప్రస్తుతం టీఆర్‌ఎస్‌కు 103 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వీరిలో 68 మంది వరుసగా రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు ఎన్నికైనవారే ఉన్నారు. పార్టీకి చెందిన సీనియర్లు పి.మహేందర్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్‌రావు, మధుసూదనాచారి, జలగం వెంకట్రావు వంటి నేతలు మితిమీరిన ఆత్మ విశ్వాసం వల్లే ఓటమి పాలైనట్లు కేసీఆర్‌ ఇటీవలి రాష్ట్ర కమిటీ సమావేశంలో వ్యాఖ్యానించినట్లు సమాచారం. కాగా ఇటీవల ఓడిపోయిన నియోజకవర్గంలో దివంగతులైన ఎమ్మెల్యే.. ఆయన ఉన్న సమయంలోనే పార్టీని భ్రష్టుపట్టించారని, ఆయన కుటుంబంపై అంత వ్యతిరేకత ఉన్నట్లు తన దృష్టికి రాలేదని వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

మరోవైపు దశాబ్దాల తరబడి వేర్వేరు పార్టీల్లో పనిచేసిన వారు రాజకీయ పునరేకీకరణలో భాగంగా టీఆర్‌ఎస్‌ గూటికి చేరుకున్నారు. వీరి నడుమ ఉన్న రాజకీయ విభేదాలు కూడా పార్టీకి నష్టం కలిగిస్తాయని అధినేత అంచనా వేస్తున్నారు. ఎమ్మెల్యేలపైనే పూర్తిగా ఆధారపడటం ద్వారా వారి పనితీరు బాగాలేని చోట పార్టీకి నష్టం కలుగుతుందనే విషయాన్ని కేసీఆర్‌ గుర్తించినట్లు పార్టీనేతలు చెప్తున్నారు. జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను సమన్వయం చేసే బాధ్యతను సంబంధిత జిల్లా మంత్రులకు, పార్టీ ప్రధానకార్యదర్శులకు అప్పగించినా ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. దీంతో గతంలో రద్దు చేసిన జిల్లా కమిటీలను పునరుద్ధరించి, జిల్లా అధ్యక్షులను నియమించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. కొత్తగా నియమితులయ్యే జిల్లా అధ్యక్షులు అధినేత లేదా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌తో నేరుగా సంబంధాలు కలిగి క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు నివేదించాల్సి ఉంటుంది. 

పార్టీకి కొత్త రక్తం.. యువతకు ప్రాధాన్యత 
పార్టీ యంత్రాంగం నుంచే కొత్త నాయకత్వం పుడుతుందని, భవిష్యత్తు రాజకీయ అవకాశాలు వారికే వస్తాయని ప్రకటించి కేసీఆర్‌ ఆ దిశగా కమిటీల నిర్మాణం ద్వారా అడుగులు వేయాలని భావిస్తున్నారు. టీఆర్‌ఎస్‌తోపాటు ఇతర పార్టీల్లోనూ సీనియర్‌ నాయకులు క్రమంగా తెరమరుగవుతున్న క్రమంలో అన్నిపార్టీలు కొత్తతరం నాయకత్వంపై దృష్టి పెడుతున్నాయి. మరో 20 ఏళ్లపాటు టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉంటుందని కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో పార్టీలోనూ కొత్త నాయకత్వాన్ని గుర్తించేందుకు పార్టీ సంస్థాగత కమిటీలు దోహదం చేస్తాయని భావిస్తున్నారు.

నాగార్జునసాగర్, హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో యువకులకు పార్టీ అభ్యర్థులుగా అవకాశమివ్వగా, ఎస్సీ కార్పొరేషన్, గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవి వంటి వాటిలోనూ కొత్తవారికే అవకాశమిచ్చారు. పార్టీ రాష్ట్ర కమిటీలోనూ యువతకు ప్రాధాన్యత ఇస్తూ మార్గదర్శకాలు సిద్ధం చేయాలని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కేసీఆర్‌ ఆదేశించినట్లు తెలిసింది. అనుబంధ కమిటీల్లోనూ యువతకే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఉన్న గుండు సుధారాణి ప్రస్తుతం వరంగల్‌ మేయర్‌గా ఎన్నిక కావడంతో ఆమె స్థానంలో యువతకు ప్రాతినిధ్యం కల్పించాలని యోచిస్తున్నట్లు సమాచారం.    

మరిన్ని వార్తలు