‘హుజూరాబాద్‌’పై ఏం చేద్దాం..? టీఆర్‌ఎస్‌ నజర్‌..!

6 Jun, 2021 03:48 IST|Sakshi

ఈటల రాజీనామా నేపథ్యంలో పరిస్థితులపై టీఆర్‌ఎస్‌ నజర్‌ 

మంత్రి గంగుల నివాసంలో మంత్రులు హరీశ్, కొప్పుల, ఇతర సీనియర్ల భేటీ 

పార్టీ యంత్రాంగం చేజారకుండా ప్రత్యేక కార్యాచరణపై కసరత్తు 

సాక్షి, హైదరాబాద్‌:  టీఆర్‌ఎస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రకటించిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై ఆ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ఈ మేరకు హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో అనుసరించాల్సిన వ్యూహంపై శనివారం రాత్రి మంత్రి గంగుల కమలాకర్‌ నివాసంలో ప్రత్యేక భేటీ జరిగింది. మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. పార్టీ కేడర్‌ చేజారకుండా ఇప్పటికే నియోజకవర్గంలోని మున్సిపాలిటీలు, మండలాల వారీగా టీఆర్‌ఎస్‌ పార్టీ ఇన్‌చార్జులను నియమించగా ఈ ఇన్‌చార్జులు తమకు కేటాయించిన మున్సిపాలిటీలు, మండలాల్లో పార్టీ పరిస్థితిని ప్రత్యేక భేటీలో వివరించారు.

జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్‌ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, మార్కెట్‌ కమిటీ చైర్మన్లు ఇప్పటికే టీఆర్‌ఎస్‌ వెంట నడుస్తామని ప్రకటించిన విషయంపై సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. అయితే పార్టీకి దూరంగా ఉన్న వారిని కూడా గుర్తించి బుజ్జగించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఈటల వెంట ఉన్నవారిని కూడా గుర్తించి పార్టీ వెంట నడిచేలా చేయడంపై దృష్టి పెట్టాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. గ్రామ, మండల స్థాయిలో పార్టీ నేతలు, క్రియాశీల కార్యకర్తలెవరూ పార్టీని వీడకుండా చూసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపైనా సమావేశంలో చర్చించారు. గతంలో ఈటలతో విభేదించి టీఆర్‌ఎస్‌ను వీడినవారు, ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులను కూడా గుర్తించి సమీకరించే దిశగా పనిచేయాలని నిర్ణయించారు. 

ఈటల, బీజేపీ బలాబలాలపైనా చర్చ 
పార్టీని వీడాక హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఈటలకు ఉన్న బలాబలాలు ఏమిటి, బీజేపీలో చేరాక పరిస్థితి ఎలా ఉంటుందన్న దానిపైనా సమావేశంలో చర్చించారు. నియోజకవర్గంలో బీజేపీ ఓటు బ్యాంకు, ఈటలపై సానుభూతి తదితరాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వ్యూహం ఖరారు చేయాలనే ఆలోచనకు వచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనే అంశంతో సంబంధం లేకుండా పార్టీ యంత్రాంగంపై పట్టు సా«ధించే దిశగా సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. ప్రస్తుత ఇన్‌చార్జులు ఇచ్చే ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా రాష్ట్రస్థాయి నేతలకు ఇన్‌చార్జులుగా బాధ్యతలు అప్పగించాలన్న అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలిసింది. నేడు కూడా భేటీౖయె తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.  

సమావేశంలో ముఖ్య నేతలంతా.. 
మంత్రి గంగుల నివాసంలో జరిగిన ఈ భేటీలో మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నారదాసు లక్ష్మణరావు, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఆరూరి రమేశ్‌తోపాటు కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు