Etela Rajender: ఈటలను దెబ్బకొట్టేందుకు వ్యూహరచన

15 May, 2021 03:40 IST|Sakshi

హుజూరాబాద్‌పై టీఆర్‌ఎస్‌ నజర్‌

మంత్రి గంగులకు బాధ్యతలు 

ప్రజాప్రతినిధుల మద్దతు కూడగట్టే పనిలో కమలాకర్‌ 

జెడ్పీ చైర్‌పర్సన్‌ సహా మెజారిటీ నాయకులు పార్టీ వెంటే.. 

హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లోనూ అదే తీరు 

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌ అయిన ఈటల రాజేందర్‌ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసే పక్షంలో హుజూరాబాద్‌లో పట్టు నిలుపుకునేందుకు టీఆర్‌ఎస్‌ ముందస్తు ప్రయత్నాలు ప్రారంభించింది. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా వివిధ పార్టీల నేతలను కలుస్తున్న ఈటల కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టిన తరువాత పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ విషయాన్ని ఆయనే ప్రకటించడంతోపాటు తన పోరాటాన్ని కొనసాగిస్తానని తెలిపారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ నాయకత్వం ఈటల ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూరాబాద్‌ నియోజకవర్గాన్ని తొలుత టార్గెట్‌ చేసింది. బర్తరఫ్‌ సమయంలో ఆయనకు మద్దతుగా నిలిచిన నాయకులను వెనుదిరిగేలా పావులు కదుపుతున్నారు. ఈ మేరకు జిల్లాకు చెందిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే మండలాల్లోని మెజారిటీ నాయకులను టీఆర్‌ఎస్‌ వైపు తిప్పడంలో గంగుల కొంత విజయం సాధించారు.

ప్రజాప్రతినిధులే తొలి టార్గెట్‌.... 
హుజూరాబాద్‌లో ఐదు మండలాలతోపాటు రెండు మున్సిపాలిటీలున్నాయి. కరీంనగర్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల విజయ ఈ నియోజకవర్గంలోని ఇల్లందకుంట మండలం నుంచే జడ్పీటీసీగా గెలిచారు. ఈటల సహకారంతోనే ఆమె జడ్పీ చైర్‌పర్సన్‌ గా ఎన్నికైనా, ఈటల ఎపిసోడ్‌లో ఆమె కనిపించలేదు. కోవిడ్‌ బారిన పడటంతో ఆమె బయటకు రాకపోయినా, టీఆర్‌ఎస్‌లోనే కొనసాగేందుకు సిద్ధమైనట్లు సమాచారం. హుజూరాబాద్‌ జడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి పార్టీ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. జమ్మికుంట జడ్పీటీసీ శ్రీరాం శ్యాం, వీణవంక జడ్పీటీసీ వనమాల భర్త సాదవరెడ్డి, కమలాపూర్‌ జడ్పీటీసీ ఎల్‌.కళ్యాణి భర్త లక్ష్మణ్‌రావు ఈటల వెంట ఉన్నారు.

అయితే.. గంగుల ఇప్పటివరకు హుజూరాబాద్, జమ్మికుంట మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులతోనే చర్చలు జరిపారు. వీణవంక, కమలాపూర్, ఇల్లందకుంట మండలాలపై కూడా తదుపరి దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల చైర్‌పర్సన్లు గందె రాధిక, తక్కళ్లపల్లి రాజేశ్వర్‌ రావుతోపాటు కౌన్సిలర్లు కూడా టీఆర్‌ఎస్‌ వెంటే ఉంటామని శుక్రవారం మీడియా ముందు వెల్లడించారు. హుజూరాబాద్‌లో పార్టీ వైపు ఎవరు ఉంటారనే దానిపై సంతకాల సేకరణ జరగగా, తిరుమల్‌రెడ్డి అనే కౌన్సిలర్‌ మినహా మిగతా వారంతా సంతకాలు చేసినట్లు సమాచారం. ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లను కూడా ఈటలకు దూరం చేసే కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.  

ముఖ్య నాయకులు పార్టీ వెంటే.. 
వీణవంక మండలానికి చెందిన గెల్లు శ్రీనివాస్‌ టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన టీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకుడిగా ఎదిగేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనతోపాటు పార్టీ రాష్ట్ర నాయకుడు పరిపాటి రవీందర్‌ రెడ్డి, కమలాపూర్‌ మండలంలో ఈటల తరువాత అన్నీ తానై వ్యవహరించే సంపత్‌రావు పార్టీకి అండగా ఉండాలని నిర్ణయించుకున్నారు. సంపత్‌రావు మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌కు బంధువు కూడా. ఆయన ప్రభావం ఈటల సొంత మండలమైన కమలాపూర్‌పై ఉండే అవకాశాలున్నాయి. కాగా.. ఈ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎంపీ కెప్టెన్‌ లక్ష్మికాంతరావు ప్రభావం ఇక్కడ ఉంది. దీంతో గంగులతోపాటు కెప్టెన్‌ సైతం హుజూరాబాద్‌లో ఈటలకు చెక్‌ పెట్టేందుకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకునే ఆలోచనతో ఉన్నారు.  

కరోనా తగ్గుముఖం పట్టాక కేటీఆర్‌ పర్యటన... 
కరోనా ప్రభావం తగ్గిన తరువాత నియోజకవర్గంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పర్యటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు మంత్రి గంగుల కమలాకర్‌ శుక్రవారం తనను కలిసిన పార్టీ హుజూరాబాద్‌ మండల, స్థానిక నాయకులకు చెప్పారు. హుజూరాబాద్‌లో పార్టీ జెండా కిందనే ఎవరైనా విజయం సాధించేది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. పార్టీ తరువాతే వ్యక్తులు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ప్రజా ప్రతినిధులకు సూచించారు.   

మరిన్ని వార్తలు