లక్షన్నర మందితో కేసీఆర్‌ సభ!

19 Jan, 2021 00:30 IST|Sakshi

‘సాగర్‌’ సమరానికి గులాబీ దళం సమాయత్తం

త్వరలో ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ ఏర్పాట్లు

22–24 తేదీల మధ్య సభ నిర్వహణకు నిర్ణయం

ఉమ్మడి నల్లగొండ జిల్లాకు వరాలు ప్రకటించనున్న సీఎం  

సాక్షి, హైదరాబాద్‌: నాగార్జునసాగర్‌ శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నికకు పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేసేందుకు హాలి యా మండల కేంద్రంలో బహిరంగ సభ నిర్వహించాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. ఈనెల 22–24 తేదీల మధ్య సభ నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించగా సభ నిర్వహణ తేదీకి సంబంధించి నేడో రేపో స్పష్టత వచ్చే అవకాశముంది. టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖ ర్‌రావు హాజరయ్యే ఈ బహిరంగ సభకు సుమారు లక్షన్నర మందిని సమీకరించా లని పార్టీ నేతలు నిర్ణయించారు. సభ నిర్వహణ తేదీకి సంబంధించి మంత్రి జగదీశ్‌రెడ్డి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను సోమవారం కలసి చర్చించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలతో కేటీఆర్‌ శనివారం జరిపిన భేటీలో సభ ఏర్పాట్లు, జన సమీకరణపై చర్చించారు.

సభ ఏర్పాట్లను పర్యవేక్షించే బాధ్యతను మాజీ ప్రభుత్వ విప్‌ కర్నె ప్రభాకర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, సోమ భరత్‌కుమార్‌ గుప్తా తదితరుల నేతృత్వంలోని కమిటీకి అప్పగించినట్లు సమాచారం. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ప్రత్యేకించి నాగార్జునసాగర్‌ నియోజకవర్గ అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను వివరించేందుకు ఈ సభ నిర్వహించాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. మరోవైపు ఈ సభ వేదికగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు పలు వరాలు ప్రకటించే యోచనలో కేసీఆర్‌ ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా సమస్యలకు సంబంధించిన ఎమ్మెల్యేల నుంచి జాబితా కోరినట్లు సమాచారం. 

ఫిబ్రవరిలో నామినేటెడ్‌ పదవుల భర్తీ 
ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలో నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ వెలువడుతుందని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. సాగర్‌ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ వెలువడకముందే రాష్ట్రస్థాయిలో నామినేటెడ్‌ పదవుల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని పార్టీ అధినేత కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్‌ పదవులు ఆశిస్తున్న నేతల జాబితాను క్రోడీకరించినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలకు కూడా రాష్ట్ర స్థాయి నామినేటెడ్‌ పదవుల్లో చోటు కల్పిస్తామని సుమా రు ఏడాదిన్నర క్రితం కేసీఆర్‌ ప్రకటించినా ఆ హామీ ఆచరణకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో నాయకుల్లో అసంతృప్తిని తొలగించేందుకు నామినేటె డ్‌ పదవుల భర్తీ ప్రక్రియ ఉపయోగపడుతుందని కేసీఆర్‌ భావిస్తున్నారు. కేటీఆర్‌తో భేటీ సందర్భంగా నల్లగొండ జిల్లా కు చెందిన నేతలు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించగా ఫిబ్రవరి మూడో వారంలోగా నామినేటెడ్‌ పదవుల భర్తీ పూర్తి చేస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చినట్లు తెలిసింది. 

20న ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో భేటీ 
వరంగల్‌–నల్లగొండ–ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మరోమారు పోటీ చేస్తారని పార్టీ అధిష్టానం ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. ఓవైపు పల్లా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వివిధ వర్గాల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తుండగా మరోవైపు కేటీఆర్‌ కూడా ఉమ్మడి జిల్లాలవారీగా భేటీలు నిర్వహిస్తున్నారు. గతేడాది డిసెంబర్‌లో ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలతో పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక వ్యూహంపై కేటీఆర్‌ సమావేశం నిర్వహించారు. మూడు రోజుల క్రితం ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలతోనూ భేటీ అయిన కేటీఆర్‌... ఈ నెల 20న ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలతో సమావేశమవుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పార్టీ ముఖ్య నేతలు విభేదాలు తొలగించుకొని ఈ సమావేశానికి రావాల్సిందిగా కేటీఆర్‌ ఆదేశించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్, ఎంపీ నామా నాగేశ్వర్‌రావు తదితరులు మాజీ మంత్రి పువ్వాడ నాగేశ్వర్‌రావుతో సోమవారం భేటీ అయ్యారు.  

>
మరిన్ని వార్తలు