Nizamabad: అక్కడ ‘కారు’ జోరుకు బ్రేక్‌ పక్కానా? మరి హస్తం పార్టీ పరిస్థితేంటి?

1 Sep, 2022 07:48 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌: నిజామాబాద్‌జిల్లాలో కారు పార్టీ జోరుకు బ్రేక్‌ పడుతుందా? కాషాయ సేన కదం తొక్కుతుందా? హస్తం బతికి బట్ట కడుతుందా? జిల్లాలోని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద ప్రజల్లో మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎంపీ విజయంతో కమలం దూకుడు మీదుంది. కాంగ్రెస్‌ మాత్రం పెద్దగా ప్రభావం చూపించలేదనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.
చదవండి: ‘గులాబీ’ బాస్ ఆదేశాలు.. ఆ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు..?

‘గులాబీ’కి వ్యతిరేక పవనాలు..
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్‌కు కొంత వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనే ప్రచారమైతే జరుగుతోంది. గణేష్ బిగాల రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ.. ప్రజా సంబంధాల విషయంలో.. నగర సమగ్రాభివృద్ధి విషయంలో అంతగా చొరవ చూపలేదన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోనూ ఎమ్మెల్యే ఎక్కడా కనిపించకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. దీంతో పాటే భూ కబ్జాలు చేశారంటూ పతాక శీర్షికలకెక్కడం వంటివాటితో ఈసారి ఆయన గెలుపు అంత తేలిక కాదనే టాక్ బలంగా వినిపిస్తోంది. మరోవైపు ధర్మపురి అరవింద్ ఎంపీ అయ్యాక నిజామాబాద్‌నగరంలో బీజేపీలో కొంత స్పీడ్‌కనిపిస్తోంది. గతంలో పోటీ చేసి ఓడిపోయిన ధన్ పాల్ సూర్యనారాయణకు మళ్లీ బీజేపీ టిక్కెట్ లభిస్తే... ఆయనపై నున్న సానుభూతి సిట్టింగ్ ఎమ్మెల్యే సీటుకు గండి కొట్టొచ్చనే చర్చ జరుగుతోంది. 

పాచిక పారుతుందా?
నిజామాబాద్‌ అర్బన్‌నుంచి ఎంపీ అరవింద్ కూడా బీజేపీ తరపున పోటీలో ఉండేందుకు ఆలోచిస్తున్నట్టు సమాచారం. మరోవైపు మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ కూడా తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. కమలం పార్టీ అధిష్ఠానం ఎవరికి టిక్కెట్ కేటాయిస్తుంది.. అరవింద్ ఎక్కడి నుంచి బరిలోకి దిగుతాడు... ఎవరికి టికెట్ వస్తే ఎవరి స్పందనలెలా ఉంటాయి. ఐకమత్యంగా ఉండగలరా... లేక, పార్టీలోనే ఉంటూ కోవర్ట్ రాజకీయాలకు తెరతీస్తారా అనే పలు అంశాలు బీజేపి విజయావకాశాలను నిర్దేశించనున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ చీఫ్‌గా పనిచేసిన డి. శ్రీనివాస్‌ పాచికలు పారి తన పెద్ద కొడుకు సంజయ్‌కు కాంగ్రెస్‌పార్టీ టిక్కెట్ దక్కితే మాత్రం పోటీ రక్తి కడుతుంది. అన్నదమ్ముల సవాళ్లు ప్రజలకు వినోదాన్ని పంచుతాయి.

నిజామాబాద్ అర్బన్‌లో త్రిముఖ పోటీ
సంజయ్‌కు గతంలో కొంత వ్యతిరేకత ఉన్నా.. ఈ మధ్య  క్షేత్రస్థాయిలో సంజయ్ తన పని తాను చేసుకుంటున్నారు. ఎక్కడా కాంట్రవర్సీల జోలికి వెళ్లకపోవడం వెనుక పెద్దాయన డీఎస్ వ్యూహాలు కూడా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో సంజయ్ బరిలోకి దిగితే అది గణేష్ బిగాలకే కాకుండా.. డీఎస్ ఫ్యామిలీకి పెట్టింది పేరైన ఇందూరు కోటలో సానుభూతి దక్కి బయటపడుతాడనుకుంటున్న ధన్‌పాల్‌కు కూడా ఇబ్బందే. ఈ నేపథ్యంలో నిజామాబాద్ అర్బన్‌లో ఇప్పటి వరకున్న సమీకరణాలను బట్టి  త్రిముఖ పోటీకి అవకాశం ఉండటమే గాకుండా.. అధికార పార్టీకైతే గడ్డురోజులని విశ్లేషకులు భావిస్తున్నారు.

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిస్థితి చూస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు మాస్ లీడర్‌గా పేరుంది. గతంలో ఆర్మూర్ నుంచి, బాన్సువాడ నుంచి గెలుపొందిన ఘనత ఆయన సొంతం కాగా.. రూరల్ నియోజకవర్గం నుంచి కూడా  గెల్చి తన పట్టును నిలుపుకోగలిగారు. ఈ క్రమంలో మళ్లీ బాజిరెడ్డి పోటీ చేస్తారో,  ప్రస్తుత జెడ్పీటీసీ అయిన ఆయన కుమారుడుని బరిలోకి దింపుతారా అనే చర్చ నడుస్తోంది.

బాజిరెడ్డి గోవర్ధన్ వైపే మొగ్గు
కానీ పార్టీ అధిష్ఠానం తన సర్వేల ప్రకారం బాజిరెడ్డి గోవర్ధన్ వైపే మొగ్గు చూపుతున్నదని విశ్వసనీయ సమాచారం. మరోవైపు ఇదే స్థానం నుంచి గతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉండి అనర్హత వేటుకు గురైన ప్రస్తుత కాంగ్రెస్ నాయకుడైన భూపతిరెడ్డి కూడా బరిలో ఉండనున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తనకు జరిగిన అవమానానికి బదులు తీర్చుకునే రీతిలో ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మరి ఆయనకు కాంగ్రెస్ టిక్కెట్ దక్కుతుందా.. బాజిరెడ్డినిగాని, ఆయన కొడుకును గాని అధికార పార్టీ బరిలోకి దింపితే భూపతిరెడ్డి ఏమేరకు ఎదుర్కొంటారన్నది ఆసక్తి కల్గించే విషయం.

బీజేపి నుంచి బాజిరెడ్డి అనుచరుడు.. దినేష్ రెడ్డి పోటీలో ఉంటాడన్న ప్రచారం జరుగుతోంది. త్రిముఖ పోరు నెలకొంటున్నట్టుగా కనిపించినా... ఇప్పటికిప్పుడైతే టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగానే పరిస్థితి ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడా మున్నూరుకాపు సామాజికవర్గంతో పాటు.. దళితులు, గిరిజనులు, ముస్లిం మైనార్టీలు విజయావకాశాల్ని ప్రభావితం చేయనున్నారు.

హాట్ టాపిక్‌గా ఆర్మూర్ సెగ్మెంట్
ఆర్మూర్ సెగ్మెంట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీ ఎంపీ అరవింద్ ఆర్మూర్ నుంచే అసెంబ్లీ బరిలోకి దిగనున్నాడన్న ప్రచారంతో పాటుగా.. పెర్కిట్లో ఆయన నివాసం ఏర్పాటు చేసుకోవడంతో ఇక్కడి పాలిటిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే రెండుసార్లు గెల్చిన అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి అరవింద్ రాక సవాల్ గా మారే అవకాశం లేకపోలేదు. మున్నూరుకాపు సామాజికవర్గమే ఇక్కడ బలంగా ఉన్న నేపథ్యంలో... అరవింద్‌కి అది కొంత ప్లస్‌ అవుతుందంటున్నారు. రెండుసార్లు గెలిచిన జీవన్ రెడ్డిపై ఉండే సహజమైన వ్యతిరేకతకు తోడు.. ఈమధ్య జరిగిన కొన్ని ఘటనలు ఆయన కెరీర్‌లో మసకలాంటివేనని చెబుతున్నారు.

ఈ క్రమంలోనే జీవన్ రెడ్డికి అధిష్ఠానం జిల్లా అధ్యక్షుడి పదవినిచ్చిందని.. నెక్స్ట్ ఆయనకు టిక్కెట్ కష్టమేనన్న ప్రచారమూ సాగుతోంది. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలో ఉన్న వినయ్ రెడ్డికి అధికారపార్టీ అవకాశం ఇవ్వనున్నట్టుగా మరో ప్రచారమూ ఉంది. లేదంటే మళ్లీ జీవన్ రెడ్డి బరిలో నిల్చినా... అరవింద్ గెలుపు నల్లేరు మీద నడకేం కాదంటున్నారు. ఎందుకంటే జీవన్ రెడ్డికి మాస్ లీడరనే పేరుంది. ఇక కాంగ్రెస్‌కు సంబంధించి మళ్లీ ఎవ్వరు బరిలోకి దిగుతారాన్న క్లారిటీ లేకపోవడం ఆ పార్టీకి పెద్ద మైనస్‌గా చెబుతున్నారు.

మంత్రికి ప్లస్ అవుతుందా?
బాల్కొండ నియోజకవర్గానికి వస్తే ఇక్కడ ప్రస్తుతం మంత్రి ప్రశాంత్ రెడ్డి హవా కొనసాగుతోంది. గతంలో పీఆర్పీ నుంచి గెల్చి ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న అనిల్ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో మంత్రి ప్రశాంత్ రెడ్డిని ఎంతవరకూ ఢీకొట్టగలడన్నది ఓ సందేహమే. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అనిల్ నియోజకవర్గంలో పర్యటించిన దాఖలాలు అంతగా లేకపోవడం.. ఇదే సమయంలో మంత్రి చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో కనిపించే రోడ్లు, వీధి దీపాలు, ఇతర పనులన్నీ మంత్రికి ప్లస్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

పైగా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకునుండే మంత్రుల్లో ఒకరిగా ఇప్పటికే ప్రశాంత్ రెడ్డికి పేరుంది. ఇక బీజేపి నుంచి మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ తనయుడు మల్లికార్జున్ పేరు.. ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నా... లోపాయికారీ ఒప్పందాలు, మల్లికార్జున్‌తో మంత్రికున్న చుట్టరికం వీటన్నింటి దృష్ట్యా... మంత్రి ప్రశాంత్ రెడ్డీదే మళ్లీ పైచేయిగా మారే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి.

అధికారపార్టీ ఎమ్మెల్యేపై వ్యతిరేకత?
బోధన్‌లోనూ అధికారపార్టీ ఎమ్మెల్యేపై వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ మధ్య జరిగిన అల్లర్లు.. ఆపత్కాలంలో  ప్రజలతో ఉండాల్సిన సంబంధాలు.. బోధన్ పట్టణాభివృద్ధి.. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ ఇంకా తెరుచుకోకపోవడం వంటివెన్నో ఈసారి సిటింగ్‌ ఎమ్మెల్యే షకీల్ కు తలబొప్పి కట్టించే అవకాశాలు ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. ఈసారి బోధన్ టిక్కెట్ షకీల్ కు ఇస్తారో, లేదోనన్న ప్రచారమూ కొంత జరగ్గా.. ఇప్పటికైతే అలాంటి పరిస్థితులేమీ కనిపించడంలేదు. అయితే బోధన్ పక్కనే ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత అత్తగారి ఊరు ఉండటంతో ఈసారి ఆమే ఇక్కడి నుంచి బరిలో ఉండవచ్చనే ఊహాగానాలూ వినిపించాయి. అయితే ఆమె మళ్లీ ఎంపీకిగానీ.. లేదంటే నిజామాబాద్ అర్బన్ నుంచిగానీ పోటీ చేసే అవకాశాలూ ఉన్నట్టు మరో ప్రచారం ఊపందుకుంది. 

మైనార్టీ ఓట్లే కీలకం..
కాంగ్రెస్‌ విషయానికి వస్తే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి హవా కొంత కనిపిస్తోంది. జిల్లాలో కాంగ్రెస్ కు పెద్దదిక్కుగా అన్నీ తానై నడిపిస్తున్న సుదర్శన్ రెడ్డి ఈమధ్య యాక్టివ్ గా తిరుగుతుండటం... ఆయనపై కొంత సానుభూతి ఉండటం కలిసివచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. బీజేపి నుంచి పెద్దగా పేరున్న అభ్యర్థులెవరూ  కనిపించకపోవడం ఆ పార్టీకి మైనస్సే. ఈ క్రమంలో పోటీ కచ్చితంగా సుదర్శన్ రెడ్డి, షకీల్ మధ్యే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ కూడా నిజామాబాద్ అర్బన్ లాగే ముస్లిం మైనార్టీ ఓట్లు చాలా కీలకం కాగా.. అవే  గెలుపోటములను ప్రభావితం చేస్తాయి.

మరిన్ని వార్తలు