చివరి వరకు సర్వశక్తులు! మునుగోడులో గెలుపు కోసం టీఆర్‌ఎస్‌ కృషి

1 Nov, 2022 02:15 IST|Sakshi
మర్రిగూడ ప్రచారంలో మాట్లాడుతున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, చిత్రంలో ఎమ్మెల్యే జోగు రామన్న 

కేసీఆర్‌ సభతో తారాస్థాయికి ప్రచారం

నేడు పలుచోట్ల కేటీఆర్, హరీశ్‌ రోడ్‌ షోలు

పోలింగ్‌ వరకు అప్రమత్తంగా ఉండాలని నిర్ణయం

నగర ఓటర్ల తరలింపుపై పార్టీ దృష్టి

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు లక్ష్యంగా నాలుగు నెలలుగా సర్వశక్తులూ ఒడ్డుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి.. ఈ నెల 3న పోలింగ్‌ ముగిసేంత వరకు అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించింది. దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేసిన ఆ పార్టీ.. ఓటర్లపై పట్టు జారకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తోంది. మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రచార గడువు ముగియనుండటంతో చివరిరోజు ప్రచారాన్ని తారాస్థాయికి తీసుకెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేసింది.

మునుగోడు నియోజకవర్గంలోని ఏడు మండలాలకు గాను ఇప్పటికే చౌటుప్పల్, గట్టుప్పల్, మునుగోడు మండల కేంద్రాల్లో జరిగిన రోడ్‌షోల్లో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు పాల్గొనగా, మర్రిగూడ రోడ్‌షోకు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు నేతృత్వం వహించారు. ఇక చివరి రోజున సంస్థాన్‌ నారాయణపురం, మునుగోడు రోడ్‌ షోలలో కేటీఆర్, నాంపల్లి, చండూరు రోడ్‌ షోలలో మంత్రి హరీశ్‌రావు పాల్గొననున్నారు. ప్రచార గడువు ముగిసిన తర్వాత నియోజకవర్గం నుంచి తిరుగుముఖం పట్టే పార్టీ ఇన్‌చార్జిలు, ప్రచార బృందాలు.. పోలింగ్‌ ముగిసేంత వరకు స్థానిక నేతలు, కేడర్‌తో సమన్వయం చేసుకోవాలని పార్టీ ఆదేశించింది.

రాజగోపాల్‌ రాజీనామాకు ముందే..
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆగస్టు 2న మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అదే నెల 8న స్పీకర్‌కు రాజీనామా లేఖ సమర్పించి, 21న బీజేపీలో చేరారు. అయితే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా ప్రకటనకు ముందే టీఆర్‌ఎస్‌ అప్రమత్తమైంది. ఈ ఏడాది జూన్‌ చివరి నుంచే ఉప ఎన్నిక కార్యాచరణపై  దృష్టి పెట్టింది. మంత్రి జగదీశ్‌రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి తక్కళ్లపల్లి రవీందర్‌రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌తో పలు దఫాలు సమావేశమైన సీఎం కేసీఆర్‌ ఉప ఎన్నికపై దిశా నిర్దేశం చేశారు.

పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలకు మునుగోడులోని మండలాల వారీగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించి ప్రచార వ్యూహానికి పదును పెట్టారు. ఆత్మీయ సమ్మేళనాలు, సామాజికవర్గాల వారీగా భేటీలు, గ్రామ స్థాయి కార్యకర్తలతో సమావేశాలను ఉప ఎన్నిక నోటిఫికేషన్‌  వెలువడక ముందే టీఆర్‌ఎస్‌ పూర్తి చేసింది.

ప్రతి ఓటునూ ఒడిసిపట్టేలా ప్రణాళిక
అభ్యర్థిని ఆలస్యంగా ఖరారు చేసినా.. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పోటీ చేస్తారనే సంకేతాలను మొదట్నుంచే ఇస్తూ వచ్చింది. దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని మునుగోడులో పార్టీ యంత్రాంగాన్ని భారీగా మోహరించారు. నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించి 10 మంది మంత్రులు, సుమారు 70 మందికి పైగా ఎమ్మెల్యేలతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలకు ప్రచార బాధ్యతలు అప్పగించారు. ప్రతి వంద మంది ఓటర్లకు ఒకరు చొప్పున ఇన్‌చార్జిలను నియమించి ప్రతి ఓటును ఒడిసిపట్టేలా ప్రణాళికను అమలు చేశారు.

ఆగస్టు 20న మునుగోడులో జరిగిన బహిరంగ సభకు హాజరు కావడం ద్వారా ఉప ఎన్నిక ప్రచారానికి శ్రీకారం చుట్టిన కేసీఆర్‌.. అక్టోబర్‌ 30న చండూరులో జరిగిన బహిరంగ సభలో పాల్గొనడం ద్వారా ప్రచారాన్ని తారస్థాయికి చేర్చారు. ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న సుమారు 40 వేల మందికి పైగా మునుగోడు ఓటర్లను పోలింగ్‌ రోజున నియోజకవర్గానికి రప్పించడంపై దృష్టి సారించింది.
చదవండి: మైక్ కట్‌.. మునుగోడులో ప్రచారానికి నేటితో తెర

మరిన్ని వార్తలు