Huzurabad Bypoll: ‘గులాబీ’ దూకుడు

3 Oct, 2021 01:15 IST|Sakshi

కేడర్‌ను నిలుపుకొంటూ.. లీడర్లను చేర్చుకుంటూ..

హుజూరాబాద్‌లో ఈటల బర్తరఫ్‌ నాటి నుంచే టీఆర్‌ఎస్‌ అప్రమత్తం

114 రోజులుగా ప్రజాక్షేత్రంలోనే.. 140 వరకు సభలు, సమావేశాలు

ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, కులాలు, వర్గాలవారీగా వరుస భేటీలు

రూ. 80 కోట్ల ప్రత్యేక నిధులతో నియోజకవర్గంలో మౌలిక వసతులు

హరీశ్‌ సారథ్యంలో హుజూరాబాద్‌లో మోహరించిన పార్టీ యంత్రాంగం

సాక్షి, హైదరాబాద్‌: హుజూరాబాద్‌ నియోజకవర్గ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శుక్రవారం ప్రారంభంకాగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ తొలిరోజే నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలుతోపాటు ప్రచారంలోనూ తమదే ముందంజ అని చాటిచెప్పాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. ఈ ఏడాది మే 1న ఈటల కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ కాగా, జూలై 12న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజు నుంచే హుజూరాబాద్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ కేడర్‌ చేజారకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. తర్వాత ఈటల వెంట వెళ్లిన లీడర్లతోపాటు ఇతర పార్టీల ముఖ్యనేతలు, క్రియాశీల నాయకులను టీఆర్‌ఎస్‌ గూటికి తెచ్చేలా పావులు కదిపి ఫలితం సాధించింది.

పార్టీ నుంచి ఈటల నిష్క్రమించిన తర్వాత 114 రోజుల వ్యవధిలో హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 140 వరకు సభలు, సమావేశాలు నిర్వహించింది. ఆర్థికమంత్రి టి.హరీశ్‌రావు సారథ్యంలో పార్టీ యంత్రాంగం ఊరూరా, ఇంటింటా ప్రచారం చేసి జనానికి చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది. తొలుత పార్టీ కేడర్‌తో మండలాలవారీగా సమావేశాలు, నియోజకవర్గంలో పెండింగ్‌ పనుల పూర్తి, కొత్త పనులకు శంకుస్థాపన వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. పలువురు నియోజకవర్గ నేతలకు రాష్ట్రస్థాయిలో నామినేటెడ్‌ పదవులు ఇవ్వడం ద్వారా స్థానిక నాయకత్వం విశ్వాసాన్ని చూరగొనే ప్రయత్నం చేసింది. ‘దళితబంధు’ అమలుకు హుజూరాబాద్‌ను వేదికగా ఎంచుకుని ఆగస్టు 16న జరిగిన  సభకు పార్టీ అధినేత కేసీఆర్‌ హాజరయ్యారు.

ఓ వైపు లబ్ధిదారులు.. మరోవైపు సామాజిక వర్గాలు
నియోజకవర్గంలో 2.36 లక్షల మంది ఓటర్లు ఉండగా వీరిలో సుమారు లక్షన్నర మంది వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులే ఉన్నట్లు టీఆర్‌ఎస్‌ గుర్తించింది. దీంతో లబ్ధిదారులను చేరుకోవడం లక్ష్యంగా మూడు నెలలుగా అనేక సభలు, సమావేశాలు నిర్వహిస్తూ వచ్చింది. సామాజికవర్గాలవారీగా ఓటర్లను గుర్తించి సమ్మేళనాలను నిర్వహించింది. మరోవైపు నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలు, ఐదు మండలాల పరిధిలో రూ.80 కోట్లు ప్రత్యేక నిధులు విడుదల చేసి పెండింగ్‌ పనులు పూర్తి చేయించేలా మంత్రి హరీశ్‌రావు కీలక పాత్ర పోషించారు. దళితబంధు పథకం లబ్ధిదారులకు అందుబాటులో ఉండేలా పార్టీ తరపున ఏడుగురు ఇన్‌చార్జీలను నియమించింది. ముగ్గురు మంత్రులు, సుమారు 20 మంది  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మరో 50 మంది టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు నియోజకవర్గంలో మకాం వేసి ప్రచారవ్యూహాన్ని అమలు చేస్తున్నారు.

సమన్వయం, ప్రచారంపైనే ఎక్కువ దృష్టి
పార్టీ కేడర్‌ చేజారకుండా చూసుకోవడం, ఇతర పార్టీల నుంచి చేరికలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలుతో హుజూరాబాద్‌ నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో పట్టు సాధించామనే ధీమా టీఆర్‌ఎస్‌లో కనిపిస్తోంది. అయితే, దుబ్బాక చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని పోలింగ్‌ తేదీవరకు అన్ని స్థాయిల్లోనూ అప్రమత్తంగా ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ‘గత మూడు నెలలుగా నియోజకవర్గంలోని ప్రతి ఓటరునూ కనీసం మూడు నుంచి నాలుగుసార్లు కలిశాం. ఇంటింటి ప్రచారం చేసి ఓటర్లను ప్రత్యక్షంగా కలిసేందుకు ఎక్కువ ప్రయత్నించాం. ఓ రకంగా ఉప ఎన్నికల సన్నాహాలకు సంబంధించి పార్టీపరంగా సిలబస్‌ పూర్తి చేశాం. ఇక తుది పరీక్ష కోసం సన్నద్ధం కావాల్సి ఉంది. ప్రత్యర్థి పార్టీలకు తావు ఇవ్వకుండా ఎప్పటికప్పుడు పార్టీ వ్యూహాన్ని పునశ్చరణ చేసుకునేలా ప్రచార సరళి ఉంటుంది’అని హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో పార్టీ తరపున కీలకంగా పనిచేస్తున్న నేత ఒకరు ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు.   

మరిన్ని వార్తలు