అభ్యర్థి ఎంపికే... అసలు సవాల్‌ 

31 Dec, 2020 07:59 IST|Sakshi

సాగర్‌ ఉపఎన్నికపై నివేదికలతో టీఆర్‌ఎస్‌ కుస్తీ 

సాక్షి, హైదరాబాద్‌: నాగార్జునసాగర్‌ శాస నసభ నియోజకవర్గం ఉపఎన్నిక ఫిబ్రవ రి లేదా మార్చిలో జరుగుతుందనే అంచనాతో పార్టీ అభ్యర్థి ఎంపిక, క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగం మధ్య సమన్వయం తదితర అంశాలపై టీఆర్‌ఎస్‌ దృష్టి సారించింది. అన్నికోణాల్లోనూ లెక్కలు కడుతూ కసరత్తును ముమ్మరం చేసింది. దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నిక, గ్రేటర్‌ ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను గుణపాఠంగా తీసుకుని పొరపాట్లకు తావులేకుండా సాగర్‌ ఉపఎన్నికకు సన్నద్ధం కా వాలని భావిస్తోంది. ఎన్నికల షెడ్యూలు వెలువడే లోగా నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల అమలును దృష్టిలో పెట్టుకుని పనిచేస్తోంది. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్‌ ఫలితాలను దృష్టిలో పెట్టుకుని... బలమైన అభ్యర్థి ఎంపికకు ప్రాధాన్యమిస్తోంది.

పార్టీ టికెట్‌ కోసం స్థానికంగా పోటీ పడుతున్న నేతలు, కాంగ్రెస్, బీజేపీ తరపున పోటీ చేసే అవకాశమున్న అభ్యర్థులు, వారి బలాబలాలు, నియోజకవర్గంలో సామాజికవర్గాల వారీగా ఓటర్ల సంఖ్యా బలం తదితరాలను ప్రాతిపదికగా తీసుకుని అభ్యరి్థని ఎంపిక చేయాలని పార్టీ అధినేత కేసీఆర్‌ భావిస్తున్నారు. ఇప్పటికే ఇంటెలిజెన్స్‌ విభాగం నివేదికలు, అంతర్గత సర్వేలతో పాటు పార్టీ ఇన్‌చార్జీలు, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే నేతల నివేదికల ఆధారంగా సాగర్‌ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితి, టికెట్‌ ఆశిస్తున్న నేతల బలాబలాలపై లోతుగా మదింపు జరుగుతోంది. 
సామాజిక వర్గాల 

లెక్కలు.. పార్టీ బలం 
పార్టీ సంస్థాగత బలం, సామాజిక వర్గాల ఓట్ల సంఖ్య తదితరాల ఆధారంగా అభ్య రి్థని ఎంపిక చేయాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. మరో వైపు అభ్యర్థి ఎంపికకు సంబంధించి ఇటీవల నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేతల అభిప్రాయాలను కూడా ప్రభుత్వ మాజీ విప్, పార్టీ ఇన్‌చార్జి నేతృత్వంలోని బృందాలు వేర్వేరుగా సేకరించినట్లు తెలిసింది. నియోజకవర్గంలో 2.16 లక్షల ఓట్లకుగాను బీసీ సామాజిక వర్గం నుంచి ప్రధానంగా యాదవులు పెద్ద సంఖ్యలో ఉండగా, రెడ్డి, ఎస్టీ సామాజిక వర్గాల ఓటర్లు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. నియోజకవర్గంలోని ఆరు మండలాలు (మాడ్గులపల్లి మండలం పాక్షికం), రెండు మున్సిపాలిటీల్లో (హాలియా, సాగర్‌) టీఆర్‌ఎస్‌ సంస్థాగతంగా బలంగా కనిపిస్తోంది.

179 గ్రామ పంచాయతీల్లో 153 మంది సర్పంచ్‌లు, ఐదుగురు ఎంపీపీలు, నలుగురు జెడ్పీటీసీ సభ్యులు, ఎనిమిదింటిలో ఏడుగురు సహకార సంఘాల చైర్మన్లు టీఆర్‌ఎస్‌కు చెందిన వారే ఉన్నారు. దీంతో పారీ్టలో అంతర్గత సమన్వయం సాధించి నాయకులు, కార్యకర్తలను ఏకతాటిపైకి తేవాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. అభ్యర్థి ఎవరైనా కేడర్‌ మద్దతు అతనికి పూర్తిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోనుంది. ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మండలాలు, మున్సిపాలిటీల వారీగా ఒకటి రెండు రోజుల్లో పార్టీ ఇన్‌చార్జీలను నియమించే అవకాశం ఉంది. దుబ్బాక అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని సాగర్‌ ఉపఎన్నిక ప్రచారంలో సీఎం కేసీఆర్‌ పాల్గొనాలని అంతర్గత నివేదికల్లో పార్టీ నేతలు పేర్కొన్నట్లు సమాచారం. 

నలుగురిలో ఎవరికో చాన్స్‌! 
స్థానికులకే టికెట్, సానుభూతి వంటి నినాదాల నేపథ్యంలో పార్టీ అభ్యర్థి ఎంపికకు సంబంధించి ఔత్సాహికుల వడపోతను టీఆర్‌ఎస్‌ పూర్తి చేసింది. ప్రధానంగా నలుగురి పేర్లు పరిశీలనలో ఉండటంతో క్షేత్రస్థాయిలో వారికి ఉండే బలాబలాలపైనా వివిధ కోణాల్లో కసరత్తు జరుగుతోంది. శా సనమండలి సభ్యులు తేరా చిన్నపరెడ్డి, న్యాయవా ది కోటిరెడ్డి, దివంగత నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్, మాజీ శాసనసభ్యులు రామ్మూర్తి యాదవ్‌ మనుమడు మన్నెం రంజిత్‌ యాదవ్‌ పేర్లు పార్టీ పరిశీలనలో ఉన్నాయి.

జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం తో తమకు అవకాశం వస్తుందని కోటిరెడ్డి, రంజిత్‌ యాదవ్‌ భావిస్తున్నారు. ఓవైపు సొంత పార్టీ అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తున్న టీఆర్‌ఎస్‌ విపక్ష పార్టీ ల వ్యూహంపైనా ఓ కన్నేసింది. కాంగ్రెస్‌ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి లేదా ఆయన కుమారుడు రఘువీర్‌రెడ్డి, బీజేపీ నుంచి నివేదితరెడ్డి లేదా కడా రి అంజయ్య యాదవ్‌ పోటీలో ఉంటే ఎదురయ్యే పరిస్థితులను కూడా టీఆర్‌ఎస్‌ బేరీజు వేస్తోంది. 

మరిన్ని వార్తలు