పువ్వాడను అభినందించిన సీఎం కేసీఆర్‌

20 Oct, 2020 11:16 IST|Sakshi

ఖమ్మం కార్పొరేషన్‌ ఓటర్ల మనోగతంపై  టీఆర్‌ఎస్‌ సర్వే

సాక్షి, ఖమ్మం: నగర పాలక సంస్థ ఎన్నికలపై అధికార టీఆర్‌ఎస్‌ దృష్టి సారించింది. నగర ఓటర్ల మనోభావాలను తెలుసుకునేందుకు ఒక అడుగు ముందుకేసింది. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అత్యంత గోప్యంగా చేయించిన అంతర్గత సర్వే అనుకూలమని తేల్చినట్లు తెలుస్తోంది. 2016 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ వశమైన నగర పాలక సంస్థ.. త్వరలో జరిగే ఎన్నికల్లోనూ ఖిల్లాపై పట్టు సాధించే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది. ఇక సిట్టింగులు.. కొత్త ముఖాలు.. అసంతృప్తి ఉన్న ప్రాంతాలేమిటనే అంశాలపై పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. 

2016లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ 50 డివిజన్లకు.. 34 డివిజన్లలో విజయం సాధించింది. నగర పాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్‌ పదవులను కైవసం చేసుకుంది. అయితే త్వరలో జరిగే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 3 వరకు ప్రతి డివిజన్‌లో సర్వే చేసిన బృందం అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నట్లు పార్టీ శ్రేణులు వెల్లడిస్తున్నాయి. ప్రతి డివిజన్‌లో 170 నుంచి 180 మందిని కలిసి.. ఇలా 8,754 మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. ప్రభుత్వ పనితీరు, నగరాభివృద్ధిపై ప్రజల్లో సానుకూలత, కొన్నిచోట్ల కార్పొరేటర్ల పనితీరుపై నెలకొన్న అసంతృప్తి సైతం వెల్లడైనట్లు తెలుస్తోంది.

50 డివిజన్లకు.. 46 డివిజన్లలో టీఆర్‌ఎస్‌ వైపే ప్రజలు మొగ్గు చూపినట్లు సర్వేలో వెల్లడైందని పార్టీ శ్రేణులు స్పష్టం చేశాయి. అనేక చోట్ల కాంగ్రెస్‌ ప్రధాన ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉన్నట్లు సర్వే స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే సర్వే ఫలితాలు పార్టీ అధినేత కేసీఆర్‌కు చేరడం, నగరంలో పార్టీ పనితీరు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు వంటి అంశాలపై చేసిన సర్వే గురించి సీఎం కేసీఆర్‌.. మంత్రి అజయ్‌తో ఫోన్‌లో ప్రస్తావించి మెజార్టీ సీట్లు గెలుచుకోబోతున్నామని అభినందనలు తెలియజేసినట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి.

దీంతో త్వరలో జరగనున్న నగర పాలక సంస్థ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తన నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. అలాగే నగర కార్పొరేషన్‌లో డివిజన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో కొత్త ముఖాలకు సైతం పార్టీ తరఫున అవకాశం లభించనుంది. దాదాపు పది డివిజన్లు కొత్తగా ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుత కార్పొరేటర్లలో పలువురు తిరిగి పోటీ చేసేందుకు అనాసక్తిగా ఉండటంతో వారి స్థానాల్లో ఎవరికి అవకాశం ఇస్తారనే అంశం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు 42 మంది ఉన్నారు. ఇందులో కాంగ్రెస్, వైఎస్సార్‌ సీపీ నుంచి గెలుపొంది టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్న వారు సైతం ఉన్నారు. వచ్చే ఏడాది ఆరంభంలోనే ఎన్నికలు ఉండే అవకాశం ఉందని భావిస్తున్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఇందుకోసం సమాయత్తమవుతున్నారు.

ఖమ్మం నగర పాలక సంస్థ ఎన్నికల బాధ్యత టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున స్థానిక ఎమ్మెల్యేగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌పై ఉండటంతో నగరంలో జరుగుతున్న అభివృద్ధితోపాటు సర్వేకు తగ్గ ఫలితాలు వచ్చేలా డివిజన్లవారీగా పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం డివిజన్లవారీగా ప్రజాదరణ కలిగిన నాయకులు, సమస్యలపై అవగాహన ఉన్న నేతలకు సంబంధించి పార్టీ వివిధ రూపాల్లో అన్వేషణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. నగరంలో డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాన్ని మరింత వేగవంతం చేయడంతోపాటు వచ్చే రెండు నెలల్లో పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. పార్టీ ప్రాతినిధ్యం వహించని డివిజన్లలో ఎవరిని రంగంలోకి దించాలనే అంశంపై పార్టీ ఇప్పటికే దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రతి డివిజన్‌ నుంచి పది మందికి పైగా ఆశావహులు కార్పొరేటర్లుగా రంగంలో ఉండేందుకు సిద్ధమవుతున్నట్లు  తెలుస్తోంది.  

మరిన్ని వార్తలు