టీఆర్‌ఎస్‌ ఇక బీఆర్‌ఎస్‌.. కేసీఆర్‌ రాజకీయ ప్రస్థానంలో మరో మలుపు..

5 Oct, 2022 15:21 IST|Sakshi

Updates:

తెలంగాణ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖితమైంది. 21 ఏళ్ల టీఆర్‌ఎస్‌ ప్రస్థానంలో మరో మలుపు చోటుచేసుకుంది. జాతీయ రాజకీయ పార్టీగా టీఆర్‌ఎస్‌ ఆవిర్భావించింది. జాతీయ పార్టీకి సంబంధించిన పేపర్లపై సీఎం కేసీఆర్‌ సంతకం చేశారు. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌(భారత్‌ రాష్ట్ర సమితి)గా మారుస్తూ తీర్మానానికి సభ్యులు ఆమోదం తెలిపారు. పార్టీ పేరును బీఆర్‌ఎస్‌గా సీఎం కేసీఆర్‌ అధికారికంగా ప్రకటించారు. నేటి నుంచి టీఆర్‌ఎస్‌ కనుమరుగు కానుంది. టీఆర్‌ఎస్‌ స్థానంలో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావించింది. జాతీయ రాజకీయాలే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ అవతరించింది.

టీఆర్‌ఎస్‌ పేరు మారుస్తూ ఈసీకి పార్టీ ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. పార్టీ పేరును భారత్‌ రాష్ట్ర సమితిగా మార్చాలని టీఆర్ఎస్‌ కోరింది. ఈ మేరకు పార్టీ రాజ్యాంగంలో సవరణలు చేశారు. యథావిధిగా పార్టీ జెండా, గుర్తు కొనసాగనున్నాయి.

జాతీయ పార్టీ కోసం టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మారుస్తూ ఆరుగురు ఎమ్మెల్యేలు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. జాతీయ పార్టీగా ఎందుకు మారుస్తున్నామో కేసీఆర్‌ వివరించారు. తెలంగాణ భవన్‌లో కీలక భేటి కొనసాగుతోంది.

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. ముందుగా తెలంగాణలో భవన్‌లో ప్రొ.జయశంకర్‌ విగ్రహానికి సీఎం కేసీఆర్‌ నివాళులర్పించారు. సర్వసభ్య సమావేశంలో 283 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశానికి కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, వీసీకే పార్టీ(తమిళనాడు) అధినేత తిరుమావళవన్‌, జాతీయ రైతు సంఘాల నేతలు హాజరయ్యారు.
చదవండి: టీఆర్‌ఎస్‌ టు బీఆర్‌ఎస్‌ 'మరో ప్రస్థానం'

టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మారుస్తూ తీర్మానం చేయనున్నారు. మధ్యాహ్నం 1.19 గంటలకు జాతీయ పార్టీకి సంబంధించి పేపర్లపై ముహూర్తానికి సీఎం కేసీఆర్‌ సంతకం పెట్టనున్నారు. సమావేశం తర్వాత ప్రతినిధులు, అతిథులకు ప్రగతి భవన్‌లో లంచ్‌ ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్‌ మీడియా సమావేశం నిర్వహించనున్నారు.

మరిన్ని వార్తలు