హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ఓటమని సర్వేల్లో తేలింది: మాజీ ఎంపీ వివేక్‌

31 Aug, 2021 09:17 IST|Sakshi

అవినీతిలో కేసీఆర్‌ నంబర్‌వన్‌

మాజీ ఎంపీ, బీజేపీ కోర్‌ కమిటీ సభ్యుడు వివేక్‌ వెంకటస్వామి

హుజూరాబాద్‌: రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నికలు ఉంటే అక్కడ సీఎం కేసీఆర్‌ తప్పుడు హామీలు ఇచ్చి, గెలిచిన తర్వాత మర్చిపోతున్నారని, దేశంలోనే అవినీతిలో కేసీఆర్‌ నంబర్‌వన్‌ అని మాజీ ఎంపీ, బీజేపీ కోర్‌ కమిటీ సభ్యుడు వివేక్‌ వెంకటస్వామి ఆరోపించారు. సోమవారం పట్టణంలోని మధువని గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మూడునాలుగు రోజులుగా హుజూరాబాద్‌లో ఈటల గెలిస్తే ఏం లాభమని టీఆర్‌ఎస్‌ నాయకులు, కేసీఆర్‌ ప్రశ్నిస్తున్నారని.. ఈటల రాజీనామా చేస్తేనే ఎన్నో లాభాలు జరిగాయి.. గెలిస్తే జరగవా అని అన్నారు. కేవలం హుజూరాబాద్‌లో ఓట్ల కోసమే ఇష్టం వచ్చిన స్కీంలు పెడుతున్నారని, దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తర్వాత సీఎం ఫాం హౌస్‌ నుంచి బయటకు వచ్చారన్నారు.
చదవండి: తెలంగాణ సిగలో మరో అందం.. వెలుగులోకి కొత్త జలపాతం

అన్ని సర్వేల్లో టీఆర్‌ఎస్‌ ఓటమే
ప్రజలను సీఎం కేసీఆర్‌ కలవాలంటే హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను గెలిపించాలని వివేక్‌ కోరారు. ఎన్నడూ జై భీమ్‌ అనని కేసీఆర్‌ ఇప్పుడు ఆ మాట అంటున్నారంటే ఎందుకో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. గతంలో ఎస్సీ ఉప ప్రణాళిక కింద ఉన్న పథకంలోనూ కార్లు, ట్రాక్టర్లు తీసుకునే వీలుండగా, దళిత బంధు కింద అవి ఎందుకని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద దోచుకున్న అవినీతి సొమ్ము ఇంటికి రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉప ఎన్నికలో అవినీతి సొమ్ముతో గెలవాలని చూస్తున్న కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలన్నారు. సర్వేలన్నీ టీఆర్‌ఎస్‌ ఓడిపోతుందని చెబుతున్నాయని తెలిపారు. కాళేశ్వరం కోసం ఎంత కరెంటు వాడారో, ఎన్ని కోట్లు ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

చదవండి: మంత్రి పదవి కోసం నేను పెదవులు మూసుకోలేదు: ఈటల​​​​​​​

మరిన్ని వార్తలు