పువ్వాడకి సీపీఐ మద్దతా? నారాయణ ఏమన్నారంటే..

24 Nov, 2023 11:41 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: ఖమ్మం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌-సీపీఐ పొత్తుగా ముందుకు వెళ్తున్నాయి. కానీ ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు కోసం కాకుండా.. పువ్వాడ అజయ్‌ కోసం సీపీఐ ప్రచారం చేస్తోందన్న ప్రచారం ఎక్కువగా వినిపిస్తోంది. ఈ ప్రచారాన్ని నారాయణ ఖండించారు. 

అజయ్‌ను తులసి వనంలో గంజాయి మొక్కగా అభివర్ణించిన నారాయణ.. ఉమ్మడి ఖమ్మంలో ఓడిపోయే బీఆర్‌ఎస్‌ సీటు అజయదేనని జోస్యం చెప్పారు. ‘‘ఖమ్మంలో సీపీఐ కాంగ్రెస్‌ సపోర్ట్‌ చేయట్లేదు అనే ప్రచారం నడుస్తోంది. కానీ, అది అపోహ మాత్రమే. సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వరరావు కొడుకు పువ్వాడ అజయ్‌కు మద్దతు ఇస్తుందనే కొందరు చెప్పుకుంటున్నారు. అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే ఇవాళ్టి చెక్‌ పెట్టాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఎవరైనా సీపీఐ నుంచి అజయ్‌కు మద్దతు ఇస్తే.. అది ఎంత పెద్ద నేత అయినా సరే చర్యలు తీసుకుంటాం’’ అని నారాయణ చెప్పారు. 

ఖమ్మంలో సీపీఐ కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి పువ్వాడ నాగేశ్వర్ రావు. కానీ, తండ్రి నాగేశ్వరరావుకి మూడు నామాలు పెట్టిన వ్యక్తి అజయ్ కుమార్. అటువంటి వ్యక్తికి ఎటువంటి పరిస్థితుల్లోనూ సీపీఐ మద్దతు ఇవ్వదు. ఉమ్మడి ఖమ్మంలో జిల్లాలో బీఆర్‌ఎస్‌ ఓడిపోయే సీటు అజయదే అని నారాయణ అన్నారు. 

ఆ మూడు పార్టీలవి ఒప్పందమే!
కాంగ్రెస్, సీపీఐకు ఓటేస్తే.. బీజేపీ, బీఆర్ఎస్ ,ఏంఐఎం.. మూడు పార్టీలు ఎలిమినేట్ అవుతాయి. ఆ మూడు ఒక ఒప్పందం ప్రకారమే ముందుకు వెళ్తున్నాయి. గోషామహల్‌లో బీజేపీ తరఫున రాజాసింగ్ పోటీ చేస్తున్నారు. అక్కడ ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టలేదు. కానీ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న చోట మాత్రం ఏంఐఎం అభ్యర్థిని నిలబెట్టింది. ఇది ఒక్కటి చాలు వీళ్లంతా ఎంతలా కలిసి ఉన్నారో చెప్పటానికి. పైకి ఒకరిపై ఒకరు విమర్శించుకున్నట్లు కనిపిస్తూ డ్రామాలు ఆడుతున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం వల్లే తెలంగాణలో ఆ పార్టీ గ్రాఫ్‌ పెరిగింది. కాంగ్రెస్, సీపీఐ గెలిస్తే దేశ రాజకీయాల్లో అనేక మార్పులు జరుగుతాయి అని నారాయణ అన్నారు.

మరిన్ని వార్తలు