-

రాచరిక పాలనకు చరమగీతం

18 Jun, 2021 08:51 IST|Sakshi

జమ్మికుంటలో మాజీ మంత్రి ఈటల పిలుపు  

చిలుక పలుకులు పలికే మంత్రులకు ఆత్మగౌరవం ఉందా? 

నిర్బంధాలతో వేధిస్తే ఖబడ్దార్‌ అని హెచ్చరిక 

ఇల్లందకుంట (కరీంనగర్‌): ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియంతృత్వ ధోరణి, రాచరిక పాలనకు చరమగీతం పాడుదామని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. 2023లో జరిగే ఎన్నికలకు హుజూరాబాద్‌ ఉప ఎన్నిక రిహార్సల్‌ లాంటిదన్నారు. ఈటల బీజేపీలో చేరిన తర్వాత గురువారం తొలిసారి కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని జమ్మికుంటకు వచ్చారు. ముందుగా నాగారంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ఆయన పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ‘అన్నా.. నీకు అన్యాయం జరిగింది. కాపాడుకునే బాధ్యత మాదంటూ ప్రజలు దీవించారని’ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి మండలానికి ఇద్దరు, ముగ్గురు మంత్రులు, ఐదుగురు ఎమ్మెల్యేలను పెట్టి కేసీఆర్‌ ఒత్తిడి తెస్తున్నారని, పోలీసు నిర్బంధాలు, ప్రలోభాలకు గురిచేస్తే ఖబడ్దార్‌ అని హెచ్చరించారు.

చిలుక పలుకులు పలుకుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు అసలు ఆత్మ గౌరవం ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణ తొలి దశ ఉద్యమానికి నాంది పలికిన హుజూరాబాద్‌ గడ్డ.. నేడు మలి దశ ఉద్యమానికి శ్రీకారం చుడుతోందని పేర్కొన్నారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలను పక్కకు పెట్టి ఎమ్మెల్యేలు, వారి పీఏలు అరాచకాలు చేస్తున్నారని, ప్రగతిభవన్‌లో రాసిన స్క్రిప్ట్‌లు ఇక్కడ చదువుతున్నారని దుయ్యబట్టారు. హుజూరాబాద్‌లో ఆట మొదలైందని, నేడో రేపో వేటగా మారవచ్చన్నారు. డబ్బు సంచులతో ప్రజల అభిమానాన్ని కొనలేరని ఎమ్మెల్యే రఘునందన్‌రావు స్పష్టం చేశారు. అంతకుముందు ఈటలకు హుజూరాబాద్‌లో బీజేపీ శ్రేణులు, అభిమానులు స్వాగతం పలికారు. కాట్రపల్లికి చెందిన 100 మంది యువకులు బీజేపీలో చేరారు.

చదవండి: ‘ఈటలకు తొలిరోజే అవమానం

మరిన్ని వార్తలు