Telangana: కుల, చేతివృత్తిదారులకు ప్రభుత్వం తీపికబురు.. రూ.లక్ష సాయం.. ఇవీ అర్హతా నిబంధనలు

7 Jun, 2023 08:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీసీ వర్గాలలోని కుల, చేతివృత్తిదారులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. కులవృత్తులు చేసుకునేవారు పనిముట్లు, ముడిసరుకు కొనుగోలు చేసుకునేందుకు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలతో పాటు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి మంగళవారం నుంచే అవకాశం కల్పించింది. గత కేబినేట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్‌ సబ్‌ కమిటీ వెనుకబడిన వర్గాల కులవృత్తిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది.

ఈ మేరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వెబ్‌సైట్‌ను మంత్రి గంగుల మంగళవారం సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. మంగళవారం నుంచి ఈనెల 20 వరకు https://tsobmmsbc.cgg. gov. in వెబ్‌సైట్‌ ద్వారా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఫొటో, ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం తదితర వివరాలతో సరళంగా దరఖాస్తు ఫారాన్ని రూపొందించినట్లు మంత్రి తెలిపారు. వీటిని ఆయా జిల్లాల యంత్రాంగం పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తుందన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈనెల 9న మంచిర్యాలలో ప్రారంభించనున్నారు.

అదేరోజు నుంచి లబ్దిదారులుగా ఎంపికైన వారికి ఆర్థిక సహాయాన్ని రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా చెక్కుల రూపంలో అందించనున్నారు. వెనుకబడిన వర్గాలలో అనాదిగా కులవృత్తులు, ఇతర చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనల నుంచి వచి్చన పథకమే ఈ లక్ష రూపాయల ఆర్థిక సాయం పథకం అని గంగుల అన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ కార్పొరేషన్‌ ఎండీ మల్లయ్య బట్టు పాల్గొన్నారు.  

బీసీల్లోని ఎన్ని వర్గాలకు? 
వెనుకబడిన వర్గాలలో కులాలను బట్టి చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి ప్రభుత్వపరంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం ఈ పథకం ఉద్దేశం. బీసీ కులాల్లో లక్ష రూపాయల ఆర్థిక సాయం పథకానికి ఎవరిని అర్హులుగా చేయాలన్న విషయంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులదే తుది నిర్ణయం. బీసీ వర్గాలలో కుల, చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి తొలి ప్రాధాన్యత ఉంటుందని ఓ అధికారి తెలిపారు. 
చదవండి: మండిపోయిన  మంగళవారం.. వచ్చే 5 రోజులు వడగాడ్పుల హెచ్చరిక 

ఇవీ అర్హతా నిబంధనలు 
►ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకాన్ని వర్తింపచేస్తారు. 
►ఈ పథకం కింద లబి్ధపొందగోరే వారు గ్రామాల్లో అయితే లక్షన్నర మేరకు, పట్టణాల్లో రూ.2 లక్షల వరకు ఆదాయ పరిమితిని కలిగి ఉండాలి. 
►దరఖాస్తు చేసుకునే వారి వయసు 18–55 ఏళ్ల మధ్య ఉండాలి. 
 ►గడిచిన ఐదేళ్లలో వివిధ పథకాల కింద రూ.50 వేల కంటే ఎక్కువ లబ్ధి పొందిన వారు అనర్హులు.   

మరిన్ని వార్తలు