పెండ్లి దావత్‌కు రాహుల్‌ వెళ్తే తప్పా?

4 May, 2022 00:42 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ నేతల్లా మాకు పార్క్‌హయత్‌లో సూట్‌ లేవు: జగ్గారెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: ‘రాహుల్‌గాంధీ ఏదో చేసినట్టు వీడియోను వైరల్‌ చేస్తున్నారు. అసలు ఆ వీడియోలో ఏముంది? రాహుల్‌ పెండ్లి దావత్‌కు వెళ్తే కూడా తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు’అని సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ నేతలు రాత్రిపూట ఎక్కడకు వెళ్తారో కెమెరాలు పెడితే తెలుస్తుందన్నారు. టీఆర్‌ఎస్‌ నేతల్లా తమకు పార్క్‌ హయత్‌లో సూట్‌లు లేవని, వాటిల్లో ఆడే తందనాలు అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. రైతులకు ఏం చేశారో ప్రభుత్వాన్ని నిలదీసేందుకే రాష్ట్రానికి రాహుల్‌ వస్తున్నారని చెప్పారు. రైతులను ముంచడంలో కేసీఆర్, మోదీలు అన్నదమ్ములని, వారి పాలనను ఎండగట్టేందుకే పర్యటిస్తున్నారని తెలిపారు. 

రైతులకు 5 రూపాయలు.. ప్రచారానికి 95 రూపాయలు 
రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాకే అన్నీ చేసినట్టు.. విద్యుత్‌ బల్బులు, కేబుల్, స్తంభాలు కూడా వాళ్లే వేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ది గ్రాఫిక్స్‌ పాలన అని, ఆయన పాలన శివాజీ సినిమాలో రజనీకాంత్‌ స్టైల్‌లా ఉందని అన్నారు. ‘కాంగ్రెస్‌ ఉచిత విద్యుత్‌ ఇచ్చి రూపాయి ప్రచారం చేసుకుంది. కేసీఆర్‌ మాత్రం ఆ విద్యుత్‌కు అయ్యేంత ఖర్చును ప్రచారానికి వాడుతున్నారు. మేం రూ. లక్ష రుణమాఫీ చేశాం. కేసీఆర్‌ చేయకపోయినా చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. చేసేది పది రూపాయల పని, రైతులకు ఇచ్చేది 5 రూపాయలు. ప్రచారానికి మాత్రం 95 రూపాయలు’అని విమర్శించారు.   

మరిన్ని వార్తలు