అర్ధరాత్రి వైఎస్‌ షర్మిల దీక్ష భగ్నం.. ఆసుపత్రికి తరలించిన పోలీసులు

11 Dec, 2022 08:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆమరణ దీక్షను శనివారం అర్ధరాత్రి జూబ్లీహిల్స్‌ పోలీసులు భగ్నం చేశారు. బలవంతంగా అపోలో ఆస్పత్రికి తరలించారు. తన పాదయాత్రకు అనుమతి ఇవ్వాలంటూ ఆమె శుక్రవారం లోటస్‌పాండ్‌ వద్ద దీక్షకు దిగిన విషయం తెలిసిందే. కాగా షర్మిల దీక్ష శనివారం రెండోరోజు కూడా కొనసాగింది. దీక్ష చేస్తున్న షర్మిలను వైఎస్‌ విజయమ్మ కలిసి సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా షర్మిల మాట్లాడారు. ‘ఇది ముఖ్యమంత్రి కేసీఆర్‌ పతనానికి నాంది. న్యాయస్థానమంటే ఆయనకు గౌరవం లేదు..’ అని విమర్శించారు. తన పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చినా కేసీఆర్‌ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తమ పార్టీ కార్యకర్తలను, నాయకులను పోలీసులు అకారణంగా అరెస్ట్‌ చేయడమే కాకుండా వారిపై కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా పార్టీ కార్యాలయం చుట్టూ బారికేడ్లు పెట్టారు. సామాన్యులను కూడా రానివ్వడం లేదు. వచి్చన వాళ్లందరినీ అదుపులోకి తీసుకుంటున్నారు..’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కేసీఆర్‌ దేశమంతా రాజకీయాలు చేసుకోవచ్చు. ఆయనకు మాత్రం అన్ని పరి్మషన్లు వస్తాయి. కానీ, ప్రజల కోసం కొట్లాడే మా పార్టీపై మాత్రం దాడులా?..’అని మండిపడ్డారు.   

షర్మిల ప్రాణాలకు ప్రమాదం: వైద్యులు 
శనివారం సాయంత్రం వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించారు. షరి్మల ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని, ఆమె 30 గంటలుగా మంచినీళ్లు సైతం తీసుకోవడం లేదని డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. వైద్య పరీక్షలు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. లాక్టేట్‌ లెవెల్స్‌ బాగా పెరిగాయని, యూరియా, బీపీ, గ్లూకోజ్‌ లెవెల్స్‌ పడిపోతున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో ఆమె వెంటనే ఆసుపత్రిలో చేరకపోతే ప్రాణాలకు ప్రమాదమని చెప్పారు. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో పోలీసులు ఆమెను బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. 

మరిన్ని వార్తలు