‘చీకోటి’ మంత్రులను విచారించాలి

31 Jul, 2022 01:26 IST|Sakshi
రేవంత్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన ఆసిఫాబాద్‌ ఆదివాసీ నేత ముర్సుకొల సరస్వతి 

అతని వెనకున్న ఎమ్మెల్యేలు, డీసీసీబీ చైర్మన్లను కూడా.. : టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: మంత్రులు తలసాని, మల్లారెడ్డి సన్నిహితుల హవాలా దందాపై ఒకవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాడులు చేస్తుంటే సీఎం కేసీఆర్‌ ఢిల్లీలో, మంత్రి కేటీఆర్‌ ఇంట్లో సేదతీరుతున్నారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. హవాలా దందాపై వారు విచారణకు ఎందుకు ఆదేశించడం లేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. శనివారం హైదరాబాద్‌లోని రేవంత్‌ నివాసంలో మాజీ మంత్రి బీంరావ్‌ కుమార్తె, 2014లో టీడీపీ నుంచి పోటీచేసి ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఉన్న ఆసిఫాబాద్‌ మాజీ సర్పంచ్‌ ముర్సుకోల సరస్వతి రేవంత్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ చీకోటి ప్రవీణ్‌ సాగించిన చీకటి కోణాల్లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీబీ చైర్మన్లపై మంత్రి కేటీఆర్‌ పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యే స్టిక్కర్‌ పడేశానని చెప్పి తప్పించుకొనే ప్రయత్నం చేసిన మంత్రి మల్లారెడ్డిపై క్రిమినల్‌ కేసు పెట్టాలన్నారు. ప్రవీణ్‌తో మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్న వీడియోలు సోషల్‌ మీడియాలో తిరుగుతుంటే ఎందుకు స్పందించడంలేదో చెప్పాలని, రాష్ట్ర దర్యాప్తు బృందాలపై నమ్మకం లేకపోతే జ్యుడీషియల్‌ విచారణకు ఆదేశించాలని సీఎం కేసీఆర్‌ను రేవంత్‌ డిమాండ్‌ చేశారు.

అలా చేయని పక్షంలో కేసీఆర్‌ కుటుంబానికి కూడా సంబంధాలున్నాయని భావించాల్సి ఉంటుందని రేవంత్‌ పేర్కొన్నారు. వన్యప్రాణులను ఫాంహౌస్‌లో పెట్టుకున్న వీడియోలు కనిపిస్తుంటే వన్యప్రాణ చట్టం ఉల్లంఘన జరిగినా కేటీఆర్‌ ఎందుకు చర్యలు తీసుకోవాలని ట్విట్టర్‌లో ఆదేశించడం లేదన్నారు. వర్షాల వల్ల 11 లక్షల ఎకరాల పంటనష్టం జరిగితే ఇప్పటివరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయం ప్రకటించలేదని రేవంత్‌ ఆరోపించారు.

ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్‌ ప్రధానిని కలవకుండా రాజకీయ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ఏర్పాటును పార్లమెంటులో ప్రధాని మోదీ అవమానించారని..ఇందుకుగాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజలకు క్షమాపణ చెప్పి పాదయాత్రకు బయలుదేరాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు.  

ఆగస్టు 5న భారీ నిరసన... 
పెట్రో ధరలు, గ్యాస్, నిత్యావసరాల ధరల పెంపును నిరసిస్తూ ఆగస్టు 5న 119 నియెజకవర్గాలతోపాటు 33 జిల్లా కేంద్రాల్లో ఆందోళన చేపట్టాలని రేవంత్‌ పిలుపునిచ్చారు. అలాగే స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఏఐసీసీ ఆదేశాల మేరకు ఆగస్టు 9 నుంచి 15 వరకు ఉత్సవాలు జరపాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీ మార్పు ప్రచారంపై పార్టీ దూతగా ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చర్చిస్తున్నారని రేవంత్‌ ఓ ప్రశ్నకు బదులిచ్చారు.  

మరిన్ని వార్తలు