‘టీఆర్‌ఎస్‌ ఖాతాలో రూ.7,600 కోట్లు’

4 Jul, 2022 02:32 IST|Sakshi
పాదయాత్రలో మాట్లాడుతున్న షర్మిల 

హుజూర్‌నగర్‌ రూరల్‌: టీఆర్‌ఎస్‌ పార్టీ అకౌంట్‌లో రూ.7,600 కోట్లు ఉన్నాయని, వాటికి వడ్డీ రూపంలో ప్రతినెలా కోట్ల రూపాయల ఆదాయం వస్తోందని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. అలాగే సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేల ఖాతాల్లో వేల కోట్ల రూపాయలు మూలుగుతున్నాయని విమర్శించారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆదివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ మండలంలోని సీతారాంపురం, లింగగిరి గ్రామాల్లో కొనసాగింది.

ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో షర్మిల మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కుటుంబ, అవినీతి పాలన కొనసాగిస్తోందని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక తెలంగాణను బీర్లు, బార్లు, నిరుద్యోగ తెలంగాణగా మార్చారని దుయ్యబట్టారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో మహిళలకు పావలా వడ్డీకి రుణాలిచ్చారని, 46 లక్షల మందికి పక్కా ఇళ్లు కట్టించారని, ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేశారని గుర్తు చేశారు.

ఉద్యమ సమయంలో నాకు, నా భార్యకు పావుసేరు బియ్యం సరిపోతాయి, నా కొడుకు, కూతురు అమెరికాలో ఉన్నారన్న కేసీఆర్‌ ఇప్పుడు తన కొడుకు, కూతురు, అల్లుడు, మేనల్లుడు ఇలా తన కుటుంబ సభ్యులందరికీ ఎలాంటి పదవులు కట్టబెట్టారో మీరే ఆలోచించాలన్నారు. వైఎస్సార్‌ టీపీ అధికారంలోకి రాగానే మొదటి సంతకం నిరుద్యోగుల ఫైలుపైనే సంతకం పెడతానని హామీఇచ్చారు. 

మరిన్ని వార్తలు