అసెంబ్లీలో నేతల బాహాబాహీ..

13 Mar, 2021 17:21 IST|Sakshi

పాట్నా: బీహార్‌ అసెంబ్లీలో అధికార‌ జేడీయూ, బీజేపీ సభ్యులు, విప‌క్ష ఆర్జేడీ స‌భ్యులు బాహాబాహీకి దిగారు. ఆ రాష్ట్ర రెవెన్యూ మంత్రి రామ్ సూర‌త్ రాయ్ సోద‌రుడికి సంబంధించిన పాఠ‌శాల‌లో ఇటీవల భారీగా అక్రమ మ‌ద్యం ప‌ట్టుబ‌డిన నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా నేతలు ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. మంత్రి సోద‌రుడి పాఠ‌శాల‌లో మ‌ద్యం ప‌ట్టుబ‌డినందుకు బాధ్యత వహిస్తూ మంత్రి రామ్‌సూర‌త్ రాయ్‌ త‌న ప‌దవికి రాజీనామా చేయాల‌ని ప్రతిప‌క్ష నేత తేజ‌స్వి యాద‌వ్ డిమాండ్ చేయడంతో ఇరు పక్షాల నేతల మధ్య గొడ‌వ మొదలైంది. 

ఇది కాస్త చిలికిచిలికి గాలివాన‌లా మారి రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారాన్ని రేపింది. అసెంబ్లీలో గొడ‌వ అనంత‌రం మీడియాతో మాట్లాడిన మంత్రి రామ్‌సూర‌త్‌.. తేజ‌స్వి డిమాండ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త‌న సోద‌రుడి పాఠ‌శాల‌లో మ‌ద్యం దొరికితే తానెలా బాధ్యున్ని అవుతాన‌ని, అసలు తానెందుకు రాజీనామా చేయాల‌ని ఆయ‌న ప్రశ్నించారు. 

తేజ‌స్వి తండ్రి లాలూప్రసాద్ యాద‌వ్ నేరం చేసి జైలుశిక్ష అనుభ‌విస్తున్నాడు కాబ‌ట్టి తేజ‌స్వి యాద‌వ్‌ను రాజీనామా చేయ‌మంటే చేస్తారా..?  తేజ‌స్వి యాద‌వ్‌పై కేసులు ఉన్నందున ఆయ‌న సోద‌రుడు తేజ్‌ప్రతాప్ యాద‌వ్ రాజీనామా చేస్తాడా..? అని మంత్రి మండిప‌డ్డారు. ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు జ‌రుగుతుంద‌ని, ద‌ర్యాప్తులో త‌న సోద‌రుడు త‌ప్పు చేసిన‌ట్లు రుజువైతే నిరభ్యంతరంగా జైలుకు పంప‌వ‌చ్చని మంత్రి ప్రకటించారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు