మాటల యుద్ధం.. ఆ దమ్ముందా: ప్రశాంత్‌

22 Dec, 2020 19:57 IST|Sakshi

కోల్‌కత్తా : మరో ఆరు నెలల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న తరుణంలో రాజకీయ వేడి ఇప్పటి నుంచే మొదలైంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ కోటను కూల్చిందుకు బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పటికే బరిలోకి దిగింది.  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మొదలు  కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఇప్పటికే ప్రచార పర్వాన్ని ప్రారంభించారు. వరుస ర్యాలీలతో తృణమూల్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఎదుర్కొనేందుకు కమళదళమంతా బెంగాల్‌పై దృష్టిసారించగా.. దీదీ మాత్రం ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మమతకు అండగా ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ రంగంలోకి దిగారు. బీజేపీ నేతలను టార్గెట్‌గా చేసుకుని సవాలు విసురుతున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం సింగిల్‌ డిజిట్‌ సీట్లకే పరిమితం అవుతుందని జోస్యం చెప్పారు. అమిత్‌ షా ప్రచారం చేస్తున్నట్లు 200 సీట్లు సాధిస్తే తాను నిర్వర్తిస్తున్న విధుల నుంచి శాశ్వతంగా వైదులుతానని స్పష్టం చేశారు. (అమిత్‌ షా ఎత్తుగడ.. మమతకు మద్దతు!)

ప్రశాంత్‌ సవాల్‌ అనంతరం బీజేపీ నేతలు ఎంట్రీ ఇవ్వడంతో ఇరు పక్షాల మధ్య ట్విటర్‌ వేదికగా మాటల యుద్ధం ప్రారంభమైంది. ప్రశాంత్‌ కిషోర్‌ ట్వీట్‌కు స్పందించిన బీజేపీ నేత కైలాష్‌ విజయ వర్గీయ.. దేశం త్వరలోనే ఓ ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త సేవలను కోల్పోనుందని కౌంటర్‌ ఇచ్చారు. బీజేపీ సృష్టించబోయే సునామీలో ఆ పార్టీ నేతలంతా కొట్టుకుపోడడం ఖాయమన్నారు. దీనికి బందులుగా స్పందించిన ప్రశాంత్‌.. 100 సీట్లు సాధించకపోతే మీరు (బీజేపీ నేతలు) అనుభవిస్తున్న పదవుల నుంచి తప్పుకునే దమ్ముందా అంటూ ఘాటుగా ప్రశ్నించారు. రానున్న అసెంబ్లీల్లో తృణమూల్‌ విజయమే లక్ష్యంగా ప్రశాంత్‌ కిషోర్‌ వ్యూహరచన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎవరి ఊహలకు అందని విధంగా రంగ ప్రవేశం చేసిన అమిత్‌ షా... మమతకు అత్యంత సన్నిహితుడైన సువేందు అధికారితో పాటు మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకుని దీదీ, ప్రశాంత్‌లకు గట్టి షాకే ఇచ్చారు. అనంతరం అప్రమత్తమైన మమత, పార్టీ నేతల్ని, ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.
 

మరిన్ని వార్తలు