-

పీసీసీపై కాంగ్రెస్‌ కసరత్తు.. తెరపైకి వచ్చిన ఇద్దరు నాయకులు

17 Jun, 2021 10:04 IST|Sakshi
మనీష్‌ తివారీ, విజయ్‌ ఇందర్‌ సింగ్లా

వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీలో కీలక మార్పులు

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే ఇటీవల రాష్ట్ర పార్టీలో సంస్థాగతంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు అవసరమైన వ్యూహాలకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ పదునుపెట్టింది. పంజాబ్‌ కాంగ్రెస్‌లో గొడవను పరిష్కరించేందుకు హైకమాండ్‌ ఎలాంటి అధికారిక నిర్ణయాన్ని తీసుకోనప్పటికీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అధిష్టానం అనేక అవకాశాలను పరిశీలిస్తోందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు, నాయకుల మధ్య సమన్వయ లోపాన్ని తగ్గించేందుకు అవసరమైన చర్యలు రాబోయే కొద్దిరోజుల్లో తీసుకుంటారని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. అందులో భాగంగా పీసీసీ అధ్యక్షుడు సునీల్‌ జఖర్‌ స్థానంలో వేరే వారికి అవకాశం ఇవ్వాలని హైకమాండ్‌ యోచిస్తోందని తెలుస్తోంది. నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ చాన్నాళ్లుగా సీఎం అమరీందర్‌పై బాహటంగానే విమర్శలు చేస్తున్నారు. వీరిద్దరి మధ్య సమోధ్య కుదర్చడం కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారింది.

పంజాబ్‌ కాంగ్రెస్‌లో గందరగోళం
వాస్తవానికి కొన్ని నెలలుగా పంజాబ్‌ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న గందరగోళ పరిస్థితుల మధ్య ప్రతిరోజూ పలు ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్, అకాలీదళ్‌ మిలాఖత్‌ అయి పనిచేస్తున్నాయనే అభిప్రాయం సాధారణ జనంలో ఉందని అసమ్మతి శిబిరం మాట్లాడటం ప్రారంభమైనప్పటి నుంచి పార్టీలో అంతర్గత గొడవ మొదలైంది. క్రమంగా ఇది సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌కు వ్యతిరేకంగా మారడంతో, పరిస్థితులను చక్కదిద్దేందుకు కాంగ్రెస్‌ హైకమాండ్‌  ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ ముందు 63 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ పనితీరుపై ప్రశ్నలు సంధించారు.

అసమ్మతిని తగ్గించేందుకు ప్యూహం
పీసీసీ అధ్యక్షుడిగా సునీల్‌ జఖర్‌ స్థానంలో ఆనంద్‌పూర్‌ సాహిబ్‌ ఎంపీ, యూపీఎ హయాంలో కేంద్రమంత్రి మనీష్‌ తివారీ, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి విజయ్‌ ఇందర్‌ సింగ్లాల పేర్లు హైకమాండ్‌ పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే మనీష్‌ తివారీ గతేడాది పార్టీలో అంతర్గత ఎన్నికలు నిర్వహించాలని సోనియాగాంధీకి లేఖ రాసిన జీ–23లో సభ్యుడిగా ఉన్నారు. కానీ ఈమధ్య కాలంలో మనీష్‌ తివారీ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌తో చాలా సన్నిహితంగా ఉంటున్నారు. ఈ కారణంగా జీ–23లో అసమ్మతిని తగ్గించేందుకు మనీష్‌ తివారీ పేరును పరిశీలిస్తున్నారని సమాచారం. మరోవైపు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి విజయ్‌ ఇందర్‌ సింగ్లా ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌తో సన్నిహితంగా ఉండటమే కాకుండా, అధిష్టాన పెద్దల్లో... ముఖ్యంగా రాహుల్‌ గాంధీ శిబిరంలో మంచి గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరుగబోయే ఎన్నికల ముందు పీసీసీ మార్పు కీలక పరిణామంగా చూడాల్సి ఉంటుంది.

చదవండి: ఇంజనీరింగ్‌ చదివారు.. గంజాయి అమ్ముతూ బుక్కయ్యారు!

మరిన్ని వార్తలు