సుశాంత్‌ కేసును మహారాష్ట్ర వర్సెస్ బిహార్ సమస్యగా చూడొద్దు

1 Aug, 2020 09:49 IST|Sakshi

ముంబై: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై దర్యాప్తును నిర్వహించడంలో ముంబై పోలీసుల సామర్థ్యాన్ని ప్రశ్నించే ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే పేర్కొన్నారు. జూన్‌లో ఆత్మహత్య చేసుకున్న నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ వ్యవహారానికి నెమ్మదిగా రాజకీయ రంగు పులుముకుంటోంది. మహారాష్ట్ర ప్రభుత్వం, పోలీసులపై భారతీయ జనతా పార్టీ నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పించడంపై సీఎం ఉద్దవ్ ఠాక్రే మాట్లాడుతూ.. ముంబై పోలీసులు ఎంతో సమర్థత కలిగిన వారు. ఈ కేసును రాష్ట్ర పోలీసులు విచారించగలరు. ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఈ కేసును నిర్వహించడంలో ముంబై పోలీసుల విశ్వసనీయతను బీజేపీ నాయకుడు అనుమానించారని ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్‌పై ఠాక్రే విరుచుకుపడ్డారు.

ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు ఎవరిదగ్గర అయినా ఉంటే నిరభ్యంతరంగా ముంబై పోలీసులకు సంప్రదిస్తే.. కేసును విచారించి దోషులకు శిక్షపడేలా చర్యలు తీసుకంటామని హామీ ఇచ్చారు. అయితే.. ఈ కేసును మహారాష్ట్ర వర్సెస్ బిహార్ సమస్యగా ఉపయోగించవద్దు. ఇది చాలా దుర్భరమైన విషయం" అని ఆయన అన్నారు. మేము 30 సంవత్సరాలు బీజేపీతో కలిసి ఉన్నాము. కానీ వారు మమ్మల్ని విశ్వసించలేదు. అయితే 30 ఏళ్లుగా మాతో రాజకీయ విభేదాలు ఉన్నవారు మమ్మల్ని విశ్వసించారు అని ఎన్‌సీపీ, కాంగ్రెస్‌, శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం గురించి ఠాక్రే పేర్కొన్నారు. ఈ కేసును ముంబై పోలీసులు చేధించగలరని, సీబీఐ దర్యాప్తు అవసరం లేదని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ ఇటీవల అన్నారు. కాగా.. జూన్‌ 14న సబర్బన్‌ బాంద్రాలోని తన అపార్ట్‌మెంట్‌లో సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు రాజ్‌పుత్ కుటుంబం, అతని కుక్‌తో సహా సుమారు 40 మంది వాంగ్మూలాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే.

(సుశాంత్‌ సూసైడ్‌ మిస్టరీలో మనీలాండరింగ్‌ కేసు)

>
మరిన్ని వార్తలు