బీజేపీతో శివసేన చెలిమి కుదిరేనా? 

18 Sep, 2021 02:57 IST|Sakshi

ఊహాగానాలకు తావిస్తోన్న ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే వ్యాఖ్యలు 

కేంద్ర మంత్రులను మాజీ, ప్రస్తుత సహచరులంటూ సంబోధించిన సీఎం 

మున్సిపల్‌ ఎన్నికలు సమీపిస్తున్న వేళ చర్చనీయాంశంగా మారిన ఉద్ధవ్‌ వ్యాఖ్యలు 

సాక్షి, ముంబై: మరాఠ్వాడ ముక్తి సంగ్రాం దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఔరంగాబాద్‌లో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. శుక్రవారం ఉదయం ఔరంగాబాద్‌లోని సిద్ధార్థ్‌ ఉద్యానవనంలో ఉన్న స్మృతి స్తంభం వద్ద సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ధ్వజారోహణం చేసి అమరులకు నివాళులర్పించారు. అనంతరం జిల్లా పరిషత్‌ భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ప్రసంగిస్తూ.. వేదికపై ఆసీనులైన ప్రస్తుత, మాజీ సహచరులందరూ ఏకతాటిపైకి వస్తే భవిష్యత్తులో సహచరులు అవుతారని పేర్కొన్నారు.

ఆ సమయంలో వేదికపై కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ రావ్‌సాహెబ్‌ ధన్వె, కేంద్ర సహాయ మంత్రి భాగవత్‌ కరాడ్‌ ఉన్నారు. వీరి సమక్షంలో ఉద్ధవ్‌ ఇలా వ్యాఖ్యలు చేయడం భవిష్యత్తులో బీజేపీ, శివసేన మళ్లీ కలిసి పోటీ చేస్తాయనే ఊహాగానాలకు పరోక్షంగా సంకేతాలిచ్చినట్లు అయింది. ఉద్ధవ్‌ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో అనేక కథనాలకు తావిస్తున్నాయి. దీంతో ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై పలువురు నాయకులు స్పందించారు. ఉద్ధవ్‌ ఠాక్రే వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని కాంగ్రెస్‌ ప్రదేశ్‌ అధ్యక్షుడు నానాపటోలే పేర్కొన్నారు. ఆయనకు ముందు నుంచే హాస్యం, గమ్మతు చేసే అలవాటుందని తెలిపారు.

ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ఒత్తిడికి గురవుతున్నారని, వారిని కాస్త నవ్వించడానికి సీఎం ఆ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని నానాపటోలే అభిప్రాయపడ్డారు. డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ స్పందిస్తూ ఉద్ధవ్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఆయన ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడవద్దో తానెలా నిర్ణయిస్తానని పేర్కొన్నారు. ఉద్ధవ్‌ మనసులో ఏముందో చెప్పలేం కదా అన్నారు. ప్రజా సమస్యలను ఎలా పరిష్కరించాలి, ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలి, ఏ నిర్ణయాలు తీసుకోవాలనే వాటిపై మాత్రమే సీఎం తనతో చర్చిస్తారని అజిత్‌ పవార్‌ తెలిపారు.

మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ స్పందిస్తూ రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియదన్నారు. మూడు పార్టీలతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదని జోస్యం చెప్పారు. బహుశా ఈ విషయం ఆయనకు గుర్తుకు వచ్చి ఉంటుందని, అందుకే మనసులోని మాటను అలా పైకి అని ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. సీఎం వ్యాఖ్యలను బట్టి చూస్తే కూటమి ప్రభుత్వంలో ఏదో జరుగుతోందని అర్థమవుతోందన్నారు.

కేంద్ర మంత్రి నారాయణ్‌ రాణె స్పందిస్తూ ఉద్ధవ్‌ మనసులో ఏముందో చెప్పడానికి తాను జ్యోతిష్యున్ని కాదన్నారు. తమతో కలిసి రావాలనుకుంటే రేపటి సహచరులు అని సంబోధించాలన్నారు. కానీ, ఇలా భవిష్యత్తులో సహచరులవుతారని ఎందుకు అనాలని ప్రశ్నించారు. ఏదైన ఉంటే స్పష్టంగా, నిర్భయంగా బయటపెట్టాలని సూచించారు. ఇలా పరోక్షంగా నాన్చడం ఎందుకని వ్యాఖ్యానించారు. మొత్తానికి మరాఠ్వాడ ముక్తి సంగ్రాం దినోత్సవం సందర్భంగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఊహాగానాలకు తావిస్తున్నాయని మాత్రం చెప్పుకోవచ్చు.   

మరిన్ని వార్తలు