బీజేపీతో 30 ఏళ్ల పొత్తులో ఒరిగిందేమీ లేదు

8 Jul, 2021 02:21 IST|Sakshi

ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే   

ముంబై : రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీతో ఎలాంటి పొత్తులు ఉండే అవకాశం లేదని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే తేల్చి చెప్పారు. 30 సంవత్సరాల పాటు పొత్తు ఉండి కూడా ఒరిగిందేమీ లేదనీ, మున్ముందు ఒరిగేది ఏమీ ఉండదనీ ఆయన స్పష్టంచేశారు. వర్షాకాల శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత ఆయన, ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్, రెవెన్యూ మంత్రి బాలాసాహెబ్‌ థోరాత్‌తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఉద్ధవ్‌ ఠాక్రే ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి సమావేశమైన తర్వాత, రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు సంభవించే అవకాశాలున్నాయనే చర్చ రాజకీయ శ్రేణుల్లో వినిపిస్తున్నాయని, ఎన్సీపీ నాయకులపై ఈడీ (ఇన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) దాడుల వల్ల ఎన్సీపీ, ప్రభుత్వం నుంచి తప్పుకుంటుందనే ఊహాగానాలు కూడా చెలరేగుతున్నాయని ఉద్ధవ్‌ను పాత్రికేయులు అడిగారు. ఉద్ధవ్‌ ఠాక్రే సమాధానమిస్తూ.. మహా ఆఘాడీ ప్రభుత్వాన్ని  సీబీఐ, ఈడీ లాంటి సంస్థలనుపయోగించి అస్థిరపరచాలనుకున్న ప్రయత్నాలేవీ ఫలించలేదనీ, అందుకే ఇలాంటి పుకార్లతో భ్రమింపజేయాలనీ చూస్తున్నారని అన్నారు. ఈ ప్రయత్నాలేవీ ఫలించే అవకాశం లేదనీ, బీజేపీతో పొత్తులు ఉండే అవకాశం లేదని ఆయన స్పష్టంచేశారు. 

రిజర్వేషన్‌ కేంద్రం చేతుల్లోనే.. 
శాసనసభలో గత రెండు రోజుల్లో విపక్ష సభ్యులు ప్రవర్తించిన తీరును సీఎం దుయ్యబట్టారు. ప్రభుత్వాలకు, ప్రతిపక్షాలకు మధ్య చర్చలు, గొడవలు జరగడం సాధారణమేనని, అయితే విపక్షాలు ఇంత గా దిగజారి ప్రవర్తిస్తాయని ఊహించలేదని ఆయన అన్నారు. మరాఠా రిజర్వేషన్‌ల గురించి మాట్లాడుతూ.. ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రకారం మరాఠాలకు రిజర్వేషన్‌ కల్పించే అధికారం రాష్ట్రానికి లేదని, ఆ అధికారం కేంద్రానికే ఉందన్నారు. దాంతో పాటు 50 శాతం కంటే రిజర్వేషన్‌లు మించరాదనే పరిమితి కూడా మరాఠా రిజర్వేషన్‌కు అడ్డు కట్ట వేస్తోందని ఆయన అన్నారు. ఉపముఖ్యమం త్రి అజిత్‌ పవార్‌ మాట్లాడుతూ..  కేంద్ర ప్రభుత్వం 50 శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్‌లను అనుమతించే విధంగా చట్టాలను సవరించాలని కోరారు. అప్పటివరకు మరాఠాలకు రిజర్వేషన్‌లు సాధ్యం కాదని, కేంద్ర ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.  

>
మరిన్ని వార్తలు