సుశాంత్‌ మృతి: రెండు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం

2 Aug, 2020 09:13 IST|Sakshi

పట్నా : బాలీవుడ్‌ యంగ్‌హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య ఉదంతం రాజకీయ ప్రకంపనలకు దారితీస్తోంది. ఈ కేసు విషయంపై మహారాష్ట్ర, బిహార్‌ ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. సుశాంత్‌ ఆత్మహత్యపై ఇటు మహారాష్ట్రలోను, అటు బిహార్‌లోనూ కేసులు నమోదుకావడంతో ఇరు రాష్ట్రాల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే విచారణ నిమిత్తం బిహార్‌ పోలీసులు ముంబైకి రావడం, అక్కడ ముంబై పోలీసులు వారిని అడ్డుకుని వెనక్కిపంపించడం వివాదానికి దారితీసింది. మరోవైపు సుశాంత్‌ ఆత్మహత్య కేసు విచారణలో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ప్రతిపక్ష బీజేపీ విమర్శించడంతో రాజ్‌పుత్‌ వ్యవహారానికి రాజకీయ రంగు పులుముకుంటోంది. ఈ నేపథ్యంలో బిహార్‌ ఉపముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌ నేత సుశిల్‌ మోదీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. (సుశాంత్‌ సూసైడ్‌ మిస్టరీలో మనీలాండరింగ్‌ కేసు)

సుశాంత్‌ ఆత్మహత్య కేసులో నిజాలు బయటపడకుండా బాలీవుడ్‌ మాఫీయా అడ్డుపడుతోందని, చిత్రపరిశ్రమలోని కొందరి ఒత్తడికి ఉద్ధవ్‌ ఠాక్రే తలొంచారని ఆరోపించారు. సంకీర్ణ ప్రభుత్వంలోని కాంగ్రెస్‌ దోషులను కాపాడే ప్రయత్నం చేస్తోందని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. తాజా కేసును విచారించే శక్తీ, సామర్థ్యాలు బిహార్‌ పోలీసులకు ఉన్నాయని, వారి విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారని, కానీ ముంబై పోలీసుల నుంచి సరైన సహకారం లేదని మండిపడ్డారు. ఈ మేరకు శనివారం రాత్రి ఓ మీడియాతో మాట్లాడిన సుశిల్‌ మోదీ.. మహారాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సుశాంత్‌ కేసును సీబీఐకి చేత దర్యాప్తు చేయించాలని డిమాండ్‌ చేశారు. (సుశాంత్‌ ఆత్మహత్య కేసులో తాజా ట్విస్ట్‌)

ఇదిలావుండగా.. బిహార్‌, బీజేపీ నేతల తీరుపై సీఎం ఠాక్రే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేసు దర్యాప్తును నిర్వహించడంలో ముంబై పోలీసుల సామర్థ్యాన్ని ప్రశ్నించే ప్రయత్నాలను తీవ్రంగా ఖండించారు. ముంబై పోలీసుల విశ్వసనీయత దెబ్బతీస్తున్న బీజేపీ నేతల తీరు సరైనది కాదని మండిపడ్డారు. కేసును విచారించి దోషులకు శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని ఠాక్రే స్పష్టం చేశారు. ఈ కేసును మహారాష్ట్ర వర్సెస్ బిహార్ సమస్యగా చూడద్దొని అన్నారు. జూన్‌ 14న సబర్బన్‌ బాంద్రాలోని తన అపార్ట్‌మెంట్‌లో సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు రాజ్‌పుత్ కుటుంబం, అతని కుక్‌తో సహా సుమారు 40 మంది వాంగ్మూలాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు