Thackeray Warning: రెచ‍్చగొట్టొద్దు..మేం తిరిగి కొడితే..! ముదురుతున్న వార్‌

2 Aug, 2021 11:02 IST|Sakshi

శివసేన భవనాన్ని కూల్చివేస్తాం: బీజేపీ నేత

థప్పడ్ సే డర్ నహి లగ్తా , దబాంగ్‌లోని ఫ్యామస్‌ డైలాగ్‌ను వాడిన  ఠాక్రే

రెచ్చగొట్టే భాషొద్దు.. మేం  తిరిగి కొడితే ఇక లేచేదే  లేదు

సాక్షి, ముంబై: శివసేన ప్రధాన కార్యాలయంపై మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలతో బీజేపీ, శివసేన మధ‍్య మరోసారి మాటల యుద్ధం రగులుతోంది. అవసరమైతే శివసేన భవనాన్ని కూల్చి వేస్తామన్న  బీజేపీ నేత వ్యాఖ్యలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. రెచ్చగొట్టేభాష మాట్లాడితే సహించమని, అలాంటి వారికి  తగిన సమాధానం చెబుతామంటూ ఘాటుగా స్పందించారు. 

ఆదివారం పునరాభివృద్ధి ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ థాకరే  తమది మూడు పార్టీల మహా వికాస్ అఘాది "ట్రిపుల్ సీట్" ప్రభుత్వంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా హిందీ బ్లాక్‌బస్టర్ "దబాంగ్" లోని  "థప్పడ్ సే డర్ నహీ లగ్తా (చెంపదెబ్బకు భయపడేది లే)" అనే ఫ్యామస్‌ డైలాగ్‌ను గుర్తుచేస్తూ బీజేపీకి గట్టి కౌంటర్‌ ఇచ్చారు.  చెప్పుతో కొట్టే  భాష మాట్లాడేవారు. అంతకంటే గట్టిగా తామిచ్చే కౌంటర్‌కి మళ్లీ తిరిగి లేవరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే ముంబైలోని శివసేన భవన్‌ను కూల్చివేస్తామని బీజేపీ నాయకుడు ప్రసాద్ లాడ్‌ వ్యాఖ్యానించారు. దివంగత బాలాసాహెబ్ ఠాక్రే పట్ల తనకు అత్యంత గౌరవమనీ, సేన భవన్‌ను పవిత్ర నివాసంగా భావిస్తానంటూ చెప్పుకొచ్చారు. తన వ్యాఖ‍్యలను మీడియా వక్రీకరించిందంటూ విచారం చేసిన ఆయన ఈ మాటలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు.మరోవైపు బీజేపీ వ్యాఖ్యలపై స్పందిచిన రాజ్యసభ ఎంపీ సంజయ్‌ రౌత్‌  శివసేన భవన్ పై దాడి గురించి బీజేపీ ఎప్పుడూ ఆలోచించదనీ, బీజేపీ వ్యతిరేక శక్తులు మాట్లాడుతున్నాయన్నారు. మహారాష్ట్రలో బీజేపీకి వీరి వల్ల నష్టమని, ప్రసాద్‌ క్షమాపణను అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. 

ఒకప్పుడు మిత్రపక్షాలుగా ఉన్న రెండు పార్టీల నేతల మధ్య తాజాగా మాటల తూటాలు పేలుతున్నాయి. మత్తుమందులకు బానిసలైన రాజకీయనేతలను మరాఠీలు సహించరనీ, తక్షణమే రాష్ట్రంలో డ్రగ్‌ డీ ఎడిక్షన్‌ కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందని సేన నేత రౌత్‌ వ్యాఖ్యలను బీజేపీ నేతలు కూడా భారీగానే తిప్పికొట్టారు. "నువ్వు చెప్పింది నిజమే రౌత్ సాహెబ్. మహారాష్ట్ర డ్రగ్స్ రహితంగా ఉండాలి. ఈ కార్యక్రమం కళానగర్ నుంచే ప్రారంభించాలి" అంటూ కేంద్ర ఎంఎస్‌ఎంఈ మంత్రి నారాయణ్ రాణే కుమారుడు, బీజేపీ ఎమ్మెల్యే నితేష్ రాణే ట్వీట్‌ చేశారు. ఠాక్రే నివాసం ముంబై బాంద్రాలోని  కళానగర్ ప్రాంతంలో ఉండటంతో సీఎంను టార్గెట్  చేస్తూ ఈ వ్యాఖ‍్య చేయడం గమనార్హం.

మరిన్ని వార్తలు