టీడీపీ హయాంలోనే లేటరైట్‌ దోపిడీ

11 Jul, 2021 01:59 IST|Sakshi

సూత్రధారులు చంద్రబాబు, లోకేష్, అయ్యన్నలే

అడ్డగోలుగా 13 లేటరైట్‌ లీజులిచ్చింది ‘దేశం’ సర్కారే

నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌ మండిపాటు

నర్సీపట్నం: విశాఖ జిల్లా సరుగుడు ప్రాంతంలో రూ.లక్షల కోట్ల విలువైన లేటరైట్‌ను టీడీపీ నాయకులు లూటీ చేశారని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ ఆరోపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు, లోకేష్, అయ్యన్నపాత్రుడు కలిసి విలువైన ఖనిజాన్ని దోచుకున్నారని ధ్వజమెత్తారు. గిరిజన గ్రామాలకు ప్రభుత్వం రహదారి సౌకర్యం కల్పిస్తే.. చూసి ఓర్వలేక నిజనిర్ధారణ కమిటీ పేరుతో అయ్యన్నపాత్రుడు ఆధ్వర్యంలో ఆ ప్రాంత టీడీపీ నాయకులు రాద్ధాంతం చేయటం విడ్డూరంగా ఉందని శనివారం ఆయన మీడియాతో అన్నారు. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో టీడీపీ ప్రభుత్వమే 13 లేటరైట్‌ లీజులు మంజురు చేసిందని గుర్తుచేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కోర్టు ఆదేశాల మేరకు ఒకేఒక్క లీజు ఇచ్చిందన్నారు. 

20లక్షల టన్నుల లేటరైట్‌ లూటీ
నర్సీపట్నం నియోజకవర్గంలోని సుందరకోట, తోరడ గ్రామాల్లో లేటరైట్‌ తవ్వకాలు జరిపింది నిజం కాదా అని అయ్యన్నపాత్రుడిని ఉమాశంకర్‌ గణేష్‌ ప్రశ్నించారు. చంద్రబాబు, అయ్యన్నపాత్రుడు అండ్‌ కో కలిసి కోటి 20 లక్షల టన్నుల లేటరైట్‌ను లూటీ చేసిందన్నారు. ఈ ఖనిజాన్ని లోకేష్‌ బినామీ కంపెనీ అయిన అండ్రో మినరల్స్‌కు కట్టబెట్టిన సంగతి అయ్యన్నపాత్రుడు గుర్తుచేసుకోవాలని ఆయనన్నారు. అలాగే, సుందరకోట, తోరడ గ్రామాల్లోని లేటరైట్‌ను తరలించేందుకు అయ్యన్నపాత్రుడు కనుసన్నల్లోనే కొండలను తొలచి, వేల చెట్లను నేలకూల్చి అక్రమంగా రోడ్డు వేసిన విషయం ఈ ప్రాంత ప్రజలకు తెలుసునన్నారు. అప్పట్లో లేటరైట్‌ లూటీపై కథనాలు రాసిన ‘సాక్షి’ విలేకరిపై హత్యాయత్నం, అడ్డుకున్న గిరిజనులపై అక్రమ కేసులు పెట్టించింది నువ్వు కాదా.. అని అయ్యన్నపాత్రుడిని ప్రశ్నించారు.

ఆందోళనల పేరుతో లేటరైట్‌ అక్రమాల నుంచి తప్పించుకోవాలని అయ్యన్నపాత్రుడు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. నిజానికి అయ్యన్న అక్రమాలపై ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణ చేయించి రూ.17 కోట్లు పెనాల్టీ విధించిందన్నారు. ప్రస్తుతం సిట్‌ విచారణ కొనసాగుతుండడంతో అక్రమాలు ఎక్కడ బయటపడతాయనే భయంతో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. బినామీ అయిన సింగం భవాని అనే గిరిజన మహిళ పేరుతో సుందరకోటలో అయ్యన్నపాత్రుడు, తనయుడు విజయ్‌ లేటరైట్‌ ముసుగులో బాక్సైట్‌ తవ్వేస్తున్నారని.. ప్రస్తుత టీడీపీ నాయకుడు రుత్తల యర్రాపాత్రుడు అప్పట్లో హైకోర్టులో పిల్‌ వేశారన్నారు. దీనిని విచారించిన హైకోర్టు బాక్సైట్‌ కాదు.. లేటరైట్‌ అని తీర్పు ఇచ్చిందన్నారు.  

మరిన్ని వార్తలు