యనమల ఏమైనా గవర్నర్‌కు సలహాదారా?

31 Jul, 2020 18:35 IST|Sakshi

సాక్షి, విజయవాడ: మూడు రాజ‌ధానుల బిల్లుకు గ‌వ‌ర్న‌ర్ విశ్వ‌భూష‌ణ్ హ‌రిచందన్ ఆమోదం తెల‌ప‌డం ప‌ట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి చీప్ విప్‌  ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఉమ్మారెడ్డి  విజ‌య‌వాడ‌లో శుక్ర‌వారం మీడియాతో మాట్లాడుతూ..  'అసెంబ్లీలో రెండు సార్లు ఆమోదం పొందితే నిబంధనలు ప్రకారం ఆ బిల్లును గవర్నర్ ఆమోదిస్తారన్నది సత్యం. ఈ దశలో కూడా గవర్నర్‌ను ప్రతిపక్షనేత యనమల తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేశారు. బిల్లులను రాష్ట్రపతికి పంపించమని లేఖ రాయడం వెనుక అంతర్యం ఏమిటి? యనమల ఏమైనా గవర్నర్‌కు సలహాదారా' అంటూ ప్ర‌శ్నించారు. (మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్‌ ఆమోదం)

'నారాయణ కమిటీ నివేదికతో అమరావతిని రాజధానిగా ఎంపిక చేసి, శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందంటూ యనమల తన లేఖలో రాశారు. ఇది శివరామకృష్ణన్ కమిటీని కూడా అవమానపరచడమే అవుతుంది. ఏది ఏమైనా ఈ రోజు గవర్నర్ వికేంద్రీకరణ, సీఆర్డీడీయే రద్దు బిల్లులు రెండింటినీ ఆమోదించారు. ఇప్పటికైనా విపక్ష తెలుగుదేశం నేతలు చెంపలు వేసుకుని గవర్నర్ నిర్ణయానికి మద్ధతు పలకాలి. రాజ్యాంగబద్ద నిర్ణయాలకు గౌరవం ఇవ్వాలి' అన్నారు.

సీఆర్‌డీఏ-2014 రద్దు, వికేంద్రీకరణ-ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు, పాలనా వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్ శుక్ర‌వారం‌ ఆమోదం తెలిపారు. రాష్ట్ర శాసనసభను ఆమోదం తెలిపి బిల్లును పరిశీలించిన గవర్నర్‌.. తన ఆమోద ముద్రవేశారు. తాజా నిర్ణయంతో ఇకపై పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు గుర్తింపు పొందనున్నాయి.

మరిన్ని వార్తలు