కాకినాడ మేయర్‌గా శివప్రసన్న

26 Oct, 2021 13:24 IST|Sakshi

డిప్యూటీ మేయర్‌గా ఉదయ్‌కుమార్‌

కాకినాడ(తూర్పుగోదావరి): తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నగరపాలక సంస్థ నూతన మేయర్‌గా సుంకర శివప్రసన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్పొరేషన్‌ ప్రత్యేక సమావేశంలో ఆమె ఎన్నిక జరిగింది. ఆమెపై పోటీ చేసేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రిసైడింగ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీశ ప్రకటించారు. డిప్యూటీ మేయర్‌–1గా 24వ డివిజన్‌ కార్పొరేటర్‌ మీసాల ఉదయ్‌కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఎక్స్‌అఫీషియో సభ్యులు, మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ వంగా గీత, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీకి చెందిన డిప్యూటీ మేయర్‌–2 చోడిపల్లి ప్రసాద్‌తో పాటు 17 మంది కార్పొరేటర్లు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనకు ఆకర్షితులై స్వచ్ఛందంగా ముందుకొచ్చి వైఎస్సార్‌సీపీ కండువాలు వేసుకుని పార్టీకి మద్దతు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ కాకినాడ నగర మాజీ అధ్యక్షుడు నున్న దొరబాబు సోమవారం మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేల సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.

సామాజిక సమతుల్యం
కాకినాడ మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక సందర్భంగా సామాజిక సమతుల్యం పాటించారు. ఎన్నికల సందర్భంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు పదవుల ఎంపికలో సామాజిక సమతుల్యం పాటిస్తానని సీఎం ఇచ్చిన హామీని ఇక్కడ నెరవేర్చారు. మేయర్‌గా కాపు సామాజికవర్గానికి చెందిన సుంకర శివప్రసన్నకు అవకాశం దక్కగా, డిప్యూటీ మేయర్‌–1 ఎస్సీ రెల్లి సామాజికవర్గానికి చెందిన మీసాల ఉదయ్‌కుమార్‌ను ఎంపిక చేశారు. కొద్దిరోజుల కిందట జరిగిన ఎన్నికలో డిప్యూటీ మేయర్‌–2గా బీసీ మత్స్యకార వాడబలిజకు చెందిన చోడిపల్లి ప్రసాద్‌కు అవకాశమిచ్చారు.   

సీఎం జగన్‌ సామాజిక న్యాయం: మంత్రి కన్నబాబు
సీఎం వైఎస్‌ జగన్‌ సామాజిక న్యాయం పాటిస్తూ బలహీనవర్గాలకు రాజకీయ పదవులు ఇస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడ కౌన్సిల్‌ రెండు డిప్యూటీ మేయర్‌ పదవులను మత్స్యకార, రెల్లి సామాజిక వర్గాలకు ఇచ్చారన్నారు. మాటలతో కాకుండా చేతలతో చేసి చూపించే సీఎం.. వైఎస్‌ జగన్‌ అని కన్నబాబు అన్నారు.

ఇది కార్పొరేటర్ల విజయం: ఎమ్మెల్యే ద్వారంపూడి
మేయర్ల ఎన్నిక కార్పొరేటర్ల విజయం అని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. సీఎం జగన్ భావాలకు అనుగుణంగా మేయర్‌గా ఒక మహిళను, రెండు డిప్యూటీ మేయర్ పదవులకు ఒక బీసీ( మత్స్యకార), ఎస్సీ(రెల్లి) కార్పొరేటర్లను ఎన్నుకున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
చదవండి: AP: ఐదు కోట్ల డోసులు.. కోవిడ్‌ టీకాల్లో మరో మైలురాయి  


డిప్యూటీ మేయర్‌ మీసాల ఉదయ్‌కుమార్‌

>
మరిన్ని వార్తలు