మోదీ నియంతృత్వంపై రాజీలేని పోరు

26 Mar, 2023 02:42 IST|Sakshi

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

రాహుల్‌గాంధీపై అనర్హత వేటును ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచన

హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో టీపీసీసీ నాయకులతో గంటపాటు భేటీ

హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రల తీరు గురించి అడిగి తెలుసుకున్న కాంగ్రెస్‌ చీఫ్‌

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేయడం మోదీ నియంతృత్వ పాలనకు నిదర్శనమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధ్వజమె త్తారు. కేంద్రంలో మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలపై రాజీలేని పోరాటం చేయాలని ఆయన పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. కర్ణాటకలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని ఢిల్లీ వెళ్తున్న ఖర్గే, కర్ణాటక పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌... శంషాబాద్‌ విమానాశ్రయంలో ఆగారు.

ఈ సందర్భంగా గంటపాటు టీపీసీసీ ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఏఐసీసీ కార్యదర్శులు నదీమ్‌ జావీద్, రోహిత్‌ చౌదరి, మధుయాష్కీగౌడ్, సంపత్‌కుమార్, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ తదితరులతో జరిపిన ఈ సమావేశంలో జాతీయ స్థాయిలో చోటుచేసుకుంటున్న పరిణామాలను చర్చించి భవిష్యత్‌ కార్యచరణపై దిశానిర్దేశం చేశారు.

బీజేపీ నియంతృత్వ పాలనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న విషయాన్ని ఏఐసీసీ చీఫ్‌ వివరించారు. రాహుల్‌గాంధీ విషయంలో మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రతిపక్షాలన్నీ ముక్త కంఠంతో ఖండించాయని, ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న రాజకీయాలపై క్షేత్రస్థాయిలో పోరాటాన్ని ఉధృతం చేయాలని సూచించారు. మోదీ, బీజేపీ చేస్తున్న అప్రజాస్వామిక పాలన తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకుగల ప్రతి అంశాన్ని ఉపయోగించుకోవాలన్నారు.

మోదీ, బీజేపీ చర్యలను తూర్పారపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ చేపడుతున్న కార్యక్రమాలను రేవంత్‌రెడ్డి ఖర్గేకు వివరించారు. రాష్ట్రంలో హాథ్‌ సే హాథ్‌ జోడో పాదయాత్ర సాగుతున్న తీరును ఈ సందర్భంగా ఖర్గే అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు 31 నియోజకవర్గాలలో పాదయా త్ర చేసినట్లు చెప్పిన రేవంత్‌... యాత్రకు ప్రజాస్పందన బాగుందని వివరించారు.

నేడు గాంధీభవన్‌లో నిరసన దీక్ష
రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ గాంధీభవన్‌లో ఆదివా రం నిరసన దీక్ష చేపట్టాలని టీపీసీసీ నిర్ణయించింది. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గాంధీ భవన్‌లోని గాంధీ విగ్రహం వద్ద దీక్ష చేపట్టనున్నట్లు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి వెల్లడించారు. నిరసన దీక్షలో ప్రతి కార్యకర్త పాల్గొనాలని పిలుపునిచ్చారు.

శనివారం గాంధీభవన్‌లో ముఖ్యనాయకులతో భేటీలో రేవంత్‌ మాట్లాడుతూ ‘ఇది అత్యంత కీలకమైన సమయం. ఈ సమయంలో మనం కలసికట్టుగా పోరాడాలి’ అని కోరారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్‌చార్జ్‌ మాణిక్‌రావ్‌ ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి నదీమ్‌ జావిద్, రోహిత్‌ చౌదరీ, సంపత్‌ కుమార్, అంజన్‌కుమార్, అజహరుద్దీన్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు