ప్రధాని దిష్టిబొమ్మ దహనం బాధాకరం: రాహుల్‌ గాంధీ

29 Oct, 2020 04:02 IST|Sakshi

పట్నా: బిహార్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీపై దాడిని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ కొనసాగించారు. దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య గురించి ప్రధాని ఎక్కడా మాట్లాడటం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వలస కూలీల వెతలకు, నిరుద్యోగానికి, పేదరికానికి ముఖ్యమంత్రి నితీశ్‌ పాలనే కారణమని మండిపడ్డారు. రాహుల్‌ ప్రసంగిస్తుండగా.. ‘మోదీ మమ్మల్ని పకోడీలు అమ్ముకోమన్నారు’ అంటూ ఒక వ్యక్తి గట్టిగా అరిచారు. దాంతో, ‘ఈ సారి మోదీజీ, నితీశ్‌జీ మీ వద్దకు వచ్చినప్పుడు వారికి పకోడీలు చేసిపెట్టండి’ అని రాహుల్‌ నవ్వుతూ జవాబిచ్చారు.

కేంద్రం తీసుకువచ్చి న వ్యవసాయ చట్టాలను కాంగ్రెస్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని రాహుల్‌ తన ప్రసంగంలో స్పష్టం చేశారు. దసరా సందర్భంగా పంజాబ్‌లోని రైతులు ప్రధాని మోదీ దిష్టి బొమ్మను దహనం చేయడం తనను బాధించిందన్నారు. ‘సాధార  ణంగా దసరా రోజు రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడి దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. కానీ ఈ సారి, బహుశా తొలిసారి ఒక ప్రధాని దిష్టిబొమ్మను తగలపెట్టారు’ అన్నారు. ‘ఈ వార్త మీ వరకువచ్చి ఉండకపోవచ్చు. ఎందుకంటే మోదీజీ, నితీశ్‌జీ మీడియాను నియంత్రిస్తుంటారు’ అని విమర్శించారు.

రాహుల్‌పై ఈసీకి ఫిర్యాదు
బిహార్‌లో తొలి దశ పోలింగ్‌ జరుగుతున్న రోజు కాంగ్రెస్‌కు ఓటేయాలని ట్వీట్‌ చేయడం ద్వారా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రాహుల్‌ గాంధీపై చర్య తీసుకోవాలని కోరుతూ బిహార్‌ లీగల్‌ సెల్‌ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.

మరిన్ని వార్తలు