ఢిల్లీలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. అమిత్‌ షా ఏమన్నారంటే?

2 Jun, 2022 20:27 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఏర్పాటుకు మొదటి నుంచి బీజేపీ మద్దతు ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. తెలంగాణ కోసం చాలా మంది యువకులు ప్రాణ త్యాగం చేశారన్నారు. గురువారం.. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. తొలిసారిగా కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు జరిపారు. ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, కిషన్‌రెడ్డి, మురళీధరన్‌ హాజరయ్యారు.
చదవండి: దేశం ప్రమాదకర పరిస్థితిలో ఉంది: సీఎం కేసీఆర్‌

ఈ సందర్భంగా అమిత్‌ షా మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తూ వచ్చిందని.. 2004 నుంచి 2014 వరకు డిమాండ్‌ను కాంగ్రెస్‌ పట్టించుకోలేదన్నారు. ఎన్నికల్లో గెలవలేమనే భయంతో 2014లో తెలంగాణ ప్రకటించారని అమిత్‌ షా అన్నారు. తెలంగాణ ఇంకా అభివృద్ధి చెందుతూ భారత్‌మాత నుదిటి బొట్టులా మెరిసిపోవాలన్నారు. 

‘‘భద్రాచలం, సంగమేశ్వరం లాంటి గొప్ప ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు బాగుండాలని కోరుకుంటాం. ఏ రాష్ట్రంపైనా సవతి తల్లి ప్రేమ చూపలేదు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ వచ్చినా గౌరవం ఇస్తాం. కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కేంద్రం తెలంగాణకు రూ.2.52 లక్షల కోట్లు ఇచ్చింది. కేంద్రానికి తెలంగాణ సహకరిస్తే మరో లక్ష కోట్లు రాష్ట్రానికి వచ్చేవని’’ అమిత్‌ షా పేర్కొన్నారు.

ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ వచ్చినా గౌరవం ఇస్తాం. కేంద్రం ఇచ్చిన నిధుల లిస్ట్‌ చదువుతూ వెళ్తే ఎన్నికలు వచ్చేస్తాయి. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశం అభివృద్ధి అని మోదీ నమ్ముతారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ఉత్సవాలకు తెలంగాణ సర్కార్‌ సహకరించలేదు. తెలంగాణ అద్భుత ప్రగతి సాధించాలని ఆకాంక్షిస్తున్నానని అమిత్‌షా అన్నారు.


 

మరిన్ని వార్తలు