Amit Shah: 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి మోదీ కాదా? అమిత్‌ షా క్లారిటీ

1 Aug, 2022 13:35 IST|Sakshi

పట్నా: 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా ఎవరుంటారని చాలాకాలంగా చర్చ జరుగుతోంది. ఈ ఉత్కంఠకు తెరదించుతూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీనే బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఉంటారని స్పష్టం చేశారు. ఆయన నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లనున్నట్లు వెల్లడించారు.

అంతేకాదు బీజేపీ-జేడీయూ పొత్తు కొసాగుతుందని అమిత్‌ షా పేర్కొన్నారు. 2024 సార్వత్రిక ఎ‍న్నికలతో పాటు 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని వివరించారు. బిహార్ రాజధాని పట్నాలో రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ మోర్చాల ఉమ్మడి జాతీయ కార్యవర్గ సమావేశాలకు అమిత్‌షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదివారం ముగింపు కార్యక్రమంలో ప్రసంగించి ఈ వ్యాఖ్యలు చేశారు.

2024 ఎన్నికల్లో ప్రధాని మోదీ రిటైర్ అవుతారని, ఆయన స్థానంలో బీజేపీ కొత్త అభ్యర్థిని తెరపైకి తీసుకొస్తుందనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు రెండేళ్ల ముందే అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. మోదీనే తమ అభ్యర్థి అని కార్యకర్తలకు స్పష్టం చేశారు.
 
కశ్మీరీలు తయారు చేసిన త్రివర్ణ పతాకాలను ఈ కార్యక్రమంలో అందరికీ పంచారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీరీల ఆలోచనలు మారాయని తెలిపిందుకే వారు తయారు చేసిన జెండాలు పంపిణీ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను పురస్కరించుకుని దేశం నలుమూలలా జాతీయ జెండాలను ఎగురవేయాలని అమిత్ షా పిలుపునిచ్చారు. ఆగస్టు 13-15వరకు మూడు రోజులపాటు ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా రెపరెపలాడాలని సూచించారు.
చదవండి: బీజేపీ చర్య సిగ్గుచేటు..

మరిన్ని వార్తలు