హిమాచల్‌లో బీజేపీ ఓటమి.. అనురాగ్‌ ఠాకూర్‌పై విమర్శల వెల్లువ

9 Dec, 2022 12:29 IST|Sakshi

షిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బీజేపీ పరాజయం పాలైంది. ప్రతి ఐదేళ్లకోసారి అధికార మార్పు సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కాంగ్రెస్‌కు పట్టంకట్టారు హిమాచల్‌ ప్రదేశ్‌ ఓటర్లు. అయితే, అధికారంలో ఉండి కూడా బీజేపీ ఓడిపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో కాషాయ దళం పరాజయం చెందడానికి కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ కారణమంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వస్తున్నాయి. హిమాచల్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన క్రమంలో అనురాగ్‌ ఠాకూర్‌పై ట్రోల్స్‌తో ఆయన ట్రెండింగ్‌లోకి వచ్చారు. రాష్ట్ర బీజేపీలో ఠాకూర్‌ అంతర్యుద్ధానికి తెరలేపారంటూ కొందరు కాషాయ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. 

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వరాష్ట్రమైన హిమాచల్‌ ప్రదేశ్‌లో ఈసారి రెబల్‌ అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురైంది. మొత్తం 68 స్థానాల్లో 21 ప్రాంతాల్లో బీజేపీ రెబల్‌ అభ్యర్థులు పోటీ చేశారు. రెండు చోట్ల మాత్రమే విజయం సాధించినప్పటికీ.. బీజేపీ అనుకూల ఓట్లు చీలిపోయాయని స్పష్టంగా తెలుస్తోంది. అదే కాంగ్రెస్‌ విజయానికి సాయపడింది. మరోవైపు.. ఈ ఎన్నికల్లో బీజేపీలో మూడు వర్గాలు ఏర్పడినట్లు స్పష్టమవుతోంది. అనురాగ్‌ ఠాకూర్‌, జేపీ నడ్డా, సీఎం జైరాం ఠాకూర్‌ వర్గం. దీంతో అభ్యర్థుల ఎంపికలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో రెబల్స్‌ బరిలోకి దిగారు. ఎవరి వర్గం వారిని వారు గెలిపించుకునేందుకు ప్రయత్నాలు చేయటం పార్టీ ఓటమికి కారణమైంది.

మరోవైపు.. బీజేపీలో కీలక నేత, మాజీ సీఎం ప్రేమ్‌కుమార్‌ థుమాల్‌ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో ఆయనకు ఈసారి టికెట్‌ ఇవ్వలేదు అధిష్ఠానం. దీంతో ఆయన కుమారుడు, కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ పార్టీకి వ్యతిరేకంగా పని చేసినట్లు కొందరు ఆరోపిస్తున్నారు. అనురాగ్‌ ఠాకూర్‌ సొంత జిల్లాలోనే ఐదు సీట్లలో బీజేపీ ఓడిపోవడం విమర్శలకు తావిచ్చింది. ‍బీజేపీలో కీలక నేతలు ఉన్నప్పటికీ.. హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఒక్కరే ప్రచారం చేసి హస్తం పార్టీకి ఘన విజయం సాధించిపెట్టారని ఓ నెజిటన్‌ కామెంట్‌ చేశారు.

ఇదీ చదవండి: ఛండీగఢ్‌ కాదు.. షిమ్లాలోనే! కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి ఎవరు?.. ఉత్కంఠ

మరిన్ని వార్తలు