టీఆర్‌ఎస్‌ అధికార దుర్వినియోగం చేస్తోంది

27 Oct, 2022 01:14 IST|Sakshi

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

మునుగోడులో డబ్బులు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారు

సాక్షి, న్యూఢిల్లీ: మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని.. వెంటనే ఆ పార్టీపై చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి కాన్వాయ్, సభలు, ర్యాలీ లపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడి చేస్తున్నారని, రాజగోపాల్‌ రెడ్డికి ఉన్న ముప్పు కారణంగా ఆయన భద్రతను బలో పేతం చేయాలని కోరారు.

తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు కమిషన్, జిల్లా ఎన్నికల అధికారి (డీఈఓ) దాదాపు 12 వేల బోగస్‌ ఓట్లను తొలగించినప్పటికీ ఇంకా ఉన్న 14 వేల ఓటర్లలో ర్యాండమ్‌ వెరిఫికేషన్‌ సందర్భంగా 1,800 కంటే ఎక్కువ బోగస్‌ ఓటర్లు ఉన్నారని ఈసీ దృష్టికి తెచ్చారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధుల బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలసి టీఆర్‌ఎస్‌పై ఫిర్యాదు చేసింది.

ఇప్పటికే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్‌ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం ఈ నెల 13న మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల సంఘాన్ని కలసిన అనంతరం ధర్మేంద్ర ప్రధాన్‌ మీడియాతో మాట్లా డుతూ, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారని, రిటర్నింగ్‌ అధికారి, డీఈవో అనుమతి లేకుండానే భారీ సంఖ్యలో వాహనాలను టీఆర్‌ఎస్‌ మోహరించిందని తెలిపారు.

అంతేగాక టీఆర్‌ఎస్‌ పార్టీ అన్ని రకాల వనరుల దుర్వినియోగం, ఓటర్లను ప్రలోభపెట్టడంతోపాటు ఆ పార్టీ నాయకులు, మంత్రులు ఓటర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వాహనాల్లో ఎలాంటి తనిఖీలు లేకుండా మద్యం, నగదును చెక్‌పోస్టుల ద్వారా తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. అలాగే మునుగోడు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు చెందిన అనధికార వ్యక్తులను తనిఖీ చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇప్పటికైనా బోగస్‌ ఓట్లను పునఃపరిశీలించి, ఓటర్ల జాబితాలో నిజమైన ఓటర్లు మాత్రమే ఉండేలా చూడాలని కోరారు. మైక్రో జనరల్‌ అబ్జర్వర్‌లను, మైక్రో పోలీస్‌ అబ్జర్వర్‌లను కూడా నియమించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర సాయుధ బలగాల ద్వారా అన్ని పోలింగ్‌ స్టేషన్లకు భద్రత కల్పించడంతో పాటు పోలింగ్‌ బూత్‌లలో వీడియోగ్రఫీ, వెబ్‌కాస్టింగ్‌ చేయాలని బీజేపీ బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది.  

మరిన్ని వార్తలు