Kishan Reddy: కుర్చీ కోసం.. కొడుకు కోసమే

20 Aug, 2021 04:08 IST|Sakshi

సీఎం కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధ్వజం

ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం మోదీది

కేసీఆర్‌ తన కుటుంబ సంక్షేమం కోసం పనిచేస్తున్నారు

సూర్యాపేట జిల్లాలో ప్రజా ఆశీర్వాద యాత్ర

కోదాడ, సూర్యాపేట అర్బన్‌: ప్రభుత్వ పథకాలకు నిధులు వెచ్చిస్తూ మోదీ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తోందని కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్‌ కేవలం తన కుటుంబ సంక్షేమం కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. అమరుల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రంలో పాలన సాగించేందుకు ఆరాట పడాల్సిన కేసీఆర్‌.. తన కుర్చీని కాపాడుకోవడం కోసం, తన కొడుకుని సీఎంను చేయడానికి మాత్రమే ఆరాట పడుతున్నారని ఆరోపిం చారు. సూర్యాపేట జిల్లా కోదాడలోని నల్లబండ గూడెం నుంచి కేంద్రమంత్రి ప్రజా ఆశీర్వాదయాత్ర గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కోదాడ, సూర్యాపేట పట్టణాల్లో నిర్వహించిన సభల్లో ఆయన ప్రసంగించారు. (చదవండి: ఎన్నాళ్లీ లాఠీ దెబ్బలు.. తెగించి కొట్లాడదాం)

కుటుంబం కోసం ఎంతకైనా దిగజారతారు
ప్రజా సమస్యలపై స్పందించడానికి ప్రగతి భవన్‌ దాటి బయటకు రాని సీఎం.. ప్రధానిని విమర్శించడానికే ముందుంటున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్‌ తన కుటుంబం కోసం ఎంతకైనా దిగజారతారని, తెలంగాణను తాకట్టు పెట్టడానికి కూడా వెనకాడరంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బంగారు తెలంగాణాలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా సమయానికి ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు.

కేంద్ర కేబినెట్‌లో 12 మంది ఎస్సీలు, 8 మంది ఎస్టీలు, 12 మంది బీసీలు మంత్రులుగా ఉన్నారని తెలి పారు. తెలంగాణ ప్రభుత్వంలో ఎవరికి పదవులు ఇచ్చారో కేసీఆర్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం సాయం అందిస్తున్న పథకాలకు పేరు మార్చి అవి తమ ఘనతే అని చెప్పుకోవడం రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే చెల్లిందని విమర్శించారు. 

2023 ఎన్నికల్లో షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇవ్వాలి
తెలంగాణలో నిజాంను మించిన నిరంకుశ పాలన సాగిస్తున్న కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు 2023లో జరిగే ఎన్నికల్లో షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చి ఫామ్‌హస్‌కు పరిమితం చేయాలనిక కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర మంత్రులను బానిసల మాదిరి చూస్తున్నారని, ఆత్మగౌరవం ఉన్న వారు ఆయన వద్ద ఉండలేరని విమర్శించారు. అందుకే ఈటల రాజేందర్‌ బయటకు వచ్చారని చెప్పారు. హుజూరాబాద్‌ ఎన్నికల్లో కేసీఆర్‌ ఎన్ని జిమ్మిక్కులు చేసినా రాజేందర్‌ విజయాన్ని ఆపలేరన్నారు.

కరోనాను కట్టడి చేయడానికి ప్రధాని మోదీ తీసుకున్న చర్యల వల్లే 130 కోట్ల జనాభా సురక్షితంగా ఉన్నారని చెప్పారు. ఇప్పటికే దాదాపు 56 కోట్ల మందికి వ్యాక్సిన్‌ వేయించగలిగామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రజలకు వివరించి వారీ ఆశీర్వాదం తీసుకోవాలని ప్రధాని చేసిన సూచన మేరకే ఈ యాత్రను చేపట్టినట్లు కిషన్‌రెడ్డి వివరించారు. బీజేపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బొబ్బా భాగ్యారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ ఎంపీ వివేక్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు